సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లు కేసుతో పాటు, అక్రమాస్తుల ఆరోపణలపై ఐటీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి రేవంత్‌ను విచారిస్తున్నారు. రెండో రోజు కూడా రేవంత్ ఇంట్లో సోదాలు జరుగుతుండటంతో శుక్రవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్దకు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వారిని అదుపు చేయడం కోసం రేవంత్ నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మొహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో.. తాము అరెస్టు చేయడానికి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. (చదవండి: రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత)
కాగా, శుక్రవారం సాయంత్రం వరకు కూడా రేవంత్ విచారణ కొనసాగడంతో.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు లోపల ఏం జరుగుతోందని నినాదాలు చేయడం ప్రారంభించారు. రేవంత్‌ను మీడియా ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు సీతక్క మాట్లాడుతూ.. రేవంత్‌కు ప్రాణహాని ఉందని.. విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌పై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను దాటుకోని ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వారి మధ్య తోపులాటు చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలను శాంతపరచడానికి పోలీసులు రేవంత్‌ను బయటకు తీసుకువచ్చారు. గేట్ ముందుకు వచ్చిన రేవంత్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయారు.
సీతక్కతోపాటు పలువురి అరెస్ట్:
రేవంత్ నివాసం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ మహిళ నేతలు సీతక్క, హరిప్రియ నాయక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ అధికారులు రేవంత్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను, అభిమానులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. రేవంత్ నివాసం వద్ద మీడియా మినహా మిగతా వారినందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment