మీడియాతో మాట్లాడుతున్న జీవీఎల్, కన్నా
సాక్షి, అమరావతి: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోని 2జీ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపిం చారు. రాష్ట్రంలో జరిగిన పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాల కుంభకోణం అతిపెద్ద దని చెప్పారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
టీడీపీ సర్కారు ఒకే ఏడాదిలో రూ.55,496 కోట్ల ప్రభుత్వ నిధులను పీడీ ఖాతాల్లో జమ చేసి, తర్వాత అవే ఖాతాల ద్వారా ఖర్చు పెట్టినట్లు చెప్పిందన్నారు. కానీ, ఆ ఖర్చుల వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అడిగినా బయటపెట్టలేదని నరసింహారావు పేర్కొన్నారు. కాగ్ ఈ విషయాలను బహిర్గతం చేస్తూ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సంబంధిత వివరాలు బయట పడకుండా తొక్కి పెట్టిందని ఆరోపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అత్యవసరంగా ఏర్పడే ఖర్చుల కోసం అధికారుల పేరిట కొన్ని పర్సనల్ డిపాజిట్ ఖాతాలు తెరవడం సహజం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఖాతాలు కేవలం వందల్లో మాత్రమే ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం 58,539 పీడీ ఖాతాలను తెరిచి, వాటి ద్వారా నిధులను ఖర్చు చేసింది. సాధారణంగా ట్రెజరీ ఖాతాల ద్వారా జరిగే జమా ఖర్చులపై అధికారుల తనిఖీ ఉంటుంది. పీడీ ఖాతాల ద్వారా జరిగే జమాఖర్చులకు ఎలాంటి పారదర్శకత ఉండదు.
2016–17లో ఏపీలో పీడీ ఖాతాల ద్వారా రూ.51,448 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికెంత ఖర్చు పెట్టారనే వివరాలను కాగ్ అడిగినా ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? పశ్చిమ బెంగాల్‌లో 153, గుజరాత్‌లో 395, ఒడిశాలో 827 పీడీ ఖాతాలు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 58,539 ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏమిటి? ఇతర రాష్ట్రాల్లో పీడీ ఖాతాల ద్వారా అక్కడి ప్రభుత్వాలు రూ.2 వేల కోట్లలోపే ఖర్చు పెడుతుంటే, మన రాష్ట్రంలో రూ.51,448 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో అంతుబట్టడం లేదు. 2017 మార్చి ఆఖరు నాటికి ఆ ఖాతాల్లో మరో రూ.26,514 కోట్లు నిధులున్నాయి.
సీబీఐతో విచారణ జరిపించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వడ్డీలకు రూ.వేల కోట్ల అప్పులు తీసుకొస్తూ, ఆ సొమ్మును కొందరు అధికారుల పీడీ ఖాతాల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటి? వాటి ద్వారా నిధులను ఏయే అవసరాలకు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడికి మళ్లించారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి. నిజయోకవర్గాల వారీగా ఇలాంటి ఖాతాలు తెరిచి, వాటిలో ఈ ప్రభుత్వ నిధులను జమ చేశారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నిధులపై ‘కాగ్’ అడిగినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా తప్పించుకుంది. వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధపడాలి.
రాష్ట్రమంతటా విస్తరించిన అవినీతి
తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతిని అంచెలంచెలుగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. సాగునీటి శాఖలో చోటుచేసుకున్న అవినీతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. దాన్ని త్వరలో బయటపెడతాం. మర్రిచెట్టు ఊడల్లాగా ప్రభుత్వ అవినీతి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ పాకింది. పీడీ ఖాతాల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే సమాధానం చెప్పాలి. వాస్తవాలు ప్రజలకు తెలిసే వరకూ ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు. పీడీ ఖాతాల కుంభకోణాన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తెస్తాం. ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ దుష్ట రాజకీయం చేస్తోంది’’ అని జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు.
కరువొచ్చినా సర్కారుకు పట్టదా?: కన్నా
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి పెట్టకపోవడం దారుణమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కరువు మండలాలను గుర్తించి, రైతాంగాన్ని ఆదుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు.
కరువు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను టీడీపీ సర్కారు ఇంకా మొదలు పెట్టలేదని విమర్శించారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దల అండతోనే రాష్ట్రంలో అక్రమ మైనింగ్ భారీస్థాయిలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో క్వారీలో చోటుచేసుకున్న మరణాలను ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment