personal deposits
-
‘పీడీ’ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించండి
సాక్షి, న్యూఢిల్లీ: రూ.53,039 కోట్ల విలువైన పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాల స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. ఈ కుంభకోణానికి కాగ్ నివేదికే సాక్ష్యమని పేర్కొన్నారు. 53,539 కోట్ల ఖాతాల ద్వారా రూ.53,038 కోట్లు డిపాజిట్ చేసి.. రూ.51,448 మేర థర్డ్ పార్టీ ఖాతాలకు బదిలీ చేశారని వివరించారు. చెల్లింపులు ఎవరికి చేశారో సంబంధిత వివరాలు ఆర్థిక శాఖ సమర్పించలేదని కాగ్ తన నివేదికలో ప్రస్తావించినట్టు వివరించారు. ఈ చెల్లింపులకు నిజమైన లబ్ధిదారులెవరో బయటపడుతుందన్న భయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందన్నారు. 63 సెల్ఫ్ చెక్‌ల ద్వారా రూ.258 కోట్ల మేరకు నగదు ఉపసంహరణ జరగడం అనుమానాలకు తావిస్తోందని స్వయంగా కాగ్ పేర్కొన్నట్టు ఈ లేఖలో జీవీఎల్ వివరించారు. ఇది ప్రజాధనాన్ని వ్యవస్థీకృతంగా దోచుకోవడమేనని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకపోయి ఉంటే కాగ్ ఆడిటింగ్‌కు సమాచారాన్ని ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బిహార్‌లోని దాణా కుంభకోణం కంటే ఆంధ్రప్రదేశ్‌లోని పీడీ స్కామ్ పెద్దదని పేర్కొన్నారు. సరైన సమయంలో బిహార్ గవర్నర్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించడంతో దాణా కుంభకోణంలో దోషులకు శిక్ష పడిందని గుర్తుచేశారు. బిహార్‌లో కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టుగానే.. తాము నిజాయితీపరులమని చెప్పిందని గుర్తుచేశారు. అందువల్ల గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించి ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని.. ఈ కుంభకోణంలో నిజమైన లబ్ధిదారులు ఎవరో తేలాలంటే ముందుగా 2016 –17కు సంబంధించి పీడీ ఖాతాలపై ప్రత్యేక కాగ్ ఆడిట్ జరిపించాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతలు దొంగల్లా తప్పించుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని చెబితే.. ఆ అవినీతిని బయటపెట్టిన వారిపై విమర్శలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అవినీతిలో అడ్డంగా దొరికినప్పుడు లాలూ ప్రసాద్‌యాదవ్ మొదట్లో బుకాయించిన తరహాలోనే ఇప్పుడు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద అవినీతిని మీడియాలో రాకుండా చేసి విజయం సాధించవచ్చని అనుకుంటున్నారు. 2జీ స్కామ్, లాలూ స్కామ్ జరిగినప్పుడు నిందితులు ఇలాగే బుకాయించారు. అవినీతిలో కూరుకుపోయినా తమను ఎవరేం చేయగలరులే అనుకున్నారు. అలా అనుకున్న వారు చాలామంది చరిత్రలో అక్రమార్కులుగా మిగిలిపోయారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన ఆదివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.53,000 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును పర్సనల్ డిపాజిట్(పీడీ) ఖాతాల్లో జమ చేసి, ఖర్చు పెట్టిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇది కచ్చితంగా అతిపెద్ద అవినీతి కుంభకోణమని పునరుద్ఘాటించారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సమాధానం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఇష్టపడడం లేదని, భయపడుతోందని జీవీఎల్ దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘రాష్ట్ర ప్రభుత్వంపై ‘కాగ్’ తీవ్ర ఆరోపణలు చేసింది. మీకు(ప్రభుత్వ పెద్దలకు) ఏమాత్రం సిగ్గు, శరం లేదా? లాలూ ప్రసాద్‌యాదవ్ కంటే దిగజారిన పరిస్థితిలో మీరు కనిపిస్తున్నారు. రూ.53,000 కోట్లు అవినీతి గురించి చెబితే తెలంగాణలో కూడా ఉన్నాయంటున్నారు. తెలంగాణలో రూ.8,545 కోట్ల నిధులను ఇలాంటి ఖాతాల్లో వేశారు. వాటికి ఆ ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ‘కాగ్’కు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీలో రూ.53,000 కోట్ల గురించి సమాధానం అడిగితే ప్రభుత్వ పెద్దలు గుమ్మడికాయ దొంగల్లా తప్పించుకుంటున్నారు. మీ వెధవ కౌంటర్లు ప్రజలకు అక్కర్లేదు. ప్రజలకు కావాల్సింది నిధుల ఖర్చుకు వివరాలు మాత్రమే. ‘చౌదరి’ కాపాడుతారని అనుకుంటున్నారేమో! పీడీ ఖాతాల్లో ప్రభుత్వ డబ్బులే జమ చేస్తారు. ఈ ఖాతాల ద్వారా ఖర్చుల్లో అక్రమాలు జరిగినా పట్టుబడే అవకాశం తక్కువ. అలా పట్టుబడకూడదనే ఆంధ్రప్రదేశ్‌లో పీడీ ఖాతాలను పెద్ద సంఖ్యలో తెరిచారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో పీడీ ఖాతాలు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 58,539 పీడీ ఖాతాలు తెరిచారు. షేర్ మార్కెట్ కుంభకోణం లాగా ప్రభుత్వ డబ్బులను ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు, దాంట్లో నుంచి ఇంకొక ఖాతాలో వేసి వివరాలు చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారు. ప్రజల డబ్బుల ఖర్చుకు వివరాలు చెప్పమంటే నాపై విమర్శలు చేసి, కావాల్సిన పత్రికల్లో తాటికాయంత ఆక్షరాలతో రాయించుకుంటే సరిపోదు. మీ నిజ స్వరూపాన్ని ‘కాగ్’ రిపోర్టు బయటపెట్టింది. కావాలంటే ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అంటున్నారు. ఎవరో చౌదరి కాపాడుతారని అనుకుంటున్నారేమో! ఈ విషయాలు ఇంతటితో ఆగవు. ఈ నిధులపై జవాబు ప్రభుత్వం చెప్పేవరకూ దీని గురించి ప్రజాకోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చుకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. వెధవ కామెంట్లు చేసి తప్పించుకోలేరు. టీడీపీ ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారాలు బయటకు రాకుండా ఎక్కువ కాలం దాచలేరు. సద్వినియోగమైతే వివరాలు ఇవ్వరేం? మన రాష్ట్రంలో రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించడానికి, దొంగలించడానికి, అవినీతి చేయడానికి భారీ సంఖ్యలో పీడీ ఖాతాలను తెరిచారు. మిగతా రాష్ట్రాల్లో కేవలం రూ.వంద కోట్లు మాత్రమే ఇలాంటి ఖాతాల్లో ఉంటే, మన రాష్ట్రంలో రూ.వేల కోట్లు ఉన్నాయి. 2జీ స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ స్కామ్‌ను బయటపెట్టినట్లుగానే ‘కాగ్’ టీడీపీ ప్రభుత్వ పీడీ ఖాతాల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘కాగ్’ నివేదికలోని అంశాలనే మేము ప్రస్తావిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినవారు అవినీతి దొంగల్లా మాట్లాడుతున్నారు తప్ప మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు. అవినీతి బయటపడిందని నిరాశ చెంది నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పీడీ ఖాతాల కుంభకోణంపై సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి. లేదంటే ప్రతి దానికీ మా నాన్న గ్రేట్, నేను గ్రేట్ అని కితాబులిచ్చుకునే నారా లోకేశ్ అయినా జవాబు చెప్పాలి. రూ.53,000 కోట్లు ఎవరు తిన్నారు? ఎవరెవరు పంచుకున్నారు? సమాధానం ఇవ్వాలి. వాటిలో కొంతవరకైనా సద్వినియోగమై ఉంటే వాటి వివరాలెందుకు ఇవ్వట్లేదు? దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ ప్రభుత్వం లాలూప్రసాద్ యాదవ్ ముద్రనే కొనసాగించాలనుకుంటే అది వారి ఇష్టం’’ అని జీవీఎల్ తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలు ♦ పీడీ ఖాతాల అవినీతి కుంభకోణానికి సంబంధించి ‘కాగ్’ తన నివేదికలో పేర్కొన్న అంశాలనే ఏడు ప్రశ్నలుగా టీడీపీ ప్రభుత్వం ముందుంచుతున్నానని, వాటికి జవాబు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ♦ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 58,000కుపైగా పీడీ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెరవాల్సి వచ్చింది? ♦ ఇవి కేవలం తాత్కాలిక అవసరాలకు వాడుకునే ఖాతాలయితే, అన్ని ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏమిటి? వీటిద్వారా రూ.వేల కోట్లు నిధులు మళ్లించారని స్పష్టంగా అర్థమవడం లేదా? ♦ పీడీ ఖాతాల ద్వారా ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలను ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పెట్టాలి. ఆ వివరాలను ‘కాగ్’ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వివరాలన్నీ బయటకు వస్తేనే దీంట్లో ఎవరు ఎంత నొక్కారో స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతుంది. ♦ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ఆఖరి నాటికి పీడీ ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్నా ఆ మొత్తాలను ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ఆ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉండాలి. అయినా దాదాపు రూ.25,000 కోట్లు పీడీ ఖాతాల్లో ఉంచారు. ♦ పీడీ ఖాతాల్లో భారీఎత్తున నిధులను వృథాగా ఉంచుకొని, 6.5 వడ్డీకి ప్రభుత్వం కొత్త అప్పులు చేసిందని ‘కాగ్’ ప్రస్తావించింది. అంటే ప్రభుత్వం వద్ద సొంత డబ్బులు ఉండి కూడా రూ.1,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తోంది. డబ్బులు ఉంచుకొని, అప్పులు తెచ్చుకొని దాదాపు రూ.1,500 కోట్లు ప్రజాధనాన్ని వడ్డీగా చెల్లిస్తున్నారు. పీడీ ఖాతాల కుంభకోణంలో ‘రుణాలపై వడ్డీ’ స్కామ్ కూడా కలిసి ఉంది. ఇది రెండు కుంభకోణాలు కలిసిన ఉన్న అంశం. ♦ పీడీ ఖాతాల ద్వారా ఏడాదిలో ఖర్చు పెట్టిన రూ.51,000 కోట్లు ఎవరికి చేరాయి? ఎవరి ఖాతాలకు మళ్లించారు? వివరాలను ‘కాగ్’కు కూడా ఎందుకు ఇవ్వలేదు? ♦ పీడీ ఖాతాల ద్వారా అధికారులు సెల్ఫ్ చెక్ ద్వారా డబ్బులు వాడకూడదు. సెల్ఫ్ చెక్‌ల ద్వారా రూ.వందల కోట్లు డ్రా చేశారని ‘కాగ్’ తన నివేదికలో పేర్కొంది. దొంగలు ఎవరెవరు? ఎవరెంత పంచుకున్నారు? అన్నింటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. -
అధికారుల పర్సనల్ ఖాతాల్లో 55 వేల కోట్లా!
సాక్షి, అమరావతి: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోని 2జీ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపిం చారు. రాష్ట్రంలో జరిగిన పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాల కుంభకోణం అతిపెద్ద దని చెప్పారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ సర్కారు ఒకే ఏడాదిలో రూ.55,496 కోట్ల ప్రభుత్వ నిధులను పీడీ ఖాతాల్లో జమ చేసి, తర్వాత అవే ఖాతాల ద్వారా ఖర్చు పెట్టినట్లు చెప్పిందన్నారు. కానీ, ఆ ఖర్చుల వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అడిగినా బయటపెట్టలేదని నరసింహారావు పేర్కొన్నారు. కాగ్ ఈ విషయాలను బహిర్గతం చేస్తూ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సంబంధిత వివరాలు బయట పడకుండా తొక్కి పెట్టిందని ఆరోపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అత్యవసరంగా ఏర్పడే ఖర్చుల కోసం అధికారుల పేరిట కొన్ని పర్సనల్ డిపాజిట్ ఖాతాలు తెరవడం సహజం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఖాతాలు కేవలం వందల్లో మాత్రమే ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం 58,539 పీడీ ఖాతాలను తెరిచి, వాటి ద్వారా నిధులను ఖర్చు చేసింది. సాధారణంగా ట్రెజరీ ఖాతాల ద్వారా జరిగే జమా ఖర్చులపై అధికారుల తనిఖీ ఉంటుంది. పీడీ ఖాతాల ద్వారా జరిగే జమాఖర్చులకు ఎలాంటి పారదర్శకత ఉండదు. 2016–17లో ఏపీలో పీడీ ఖాతాల ద్వారా రూ.51,448 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికెంత ఖర్చు పెట్టారనే వివరాలను కాగ్ అడిగినా ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? పశ్చిమ బెంగాల్లో 153, గుజరాత్లో 395, ఒడిశాలో 827 పీడీ ఖాతాలు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 58,539 ఖాతాలు తెరవాల్సిన అవసరం ఏమిటి? ఇతర రాష్ట్రాల్లో పీడీ ఖాతాల ద్వారా అక్కడి ప్రభుత్వాలు రూ.2 వేల కోట్లలోపే ఖర్చు పెడుతుంటే, మన రాష్ట్రంలో రూ.51,448 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో అంతుబట్టడం లేదు. 2017 మార్చి ఆఖరు నాటికి ఆ ఖాతాల్లో మరో రూ.26,514 కోట్లు నిధులున్నాయి. సీబీఐతో విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వడ్డీలకు రూ.వేల కోట్ల అప్పులు తీసుకొస్తూ, ఆ సొమ్మును కొందరు అధికారుల పీడీ ఖాతాల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటి? వాటి ద్వారా నిధులను ఏయే అవసరాలకు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడికి మళ్లించారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి. నిజయోకవర్గాల వారీగా ఇలాంటి ఖాతాలు తెరిచి, వాటిలో ఈ ప్రభుత్వ నిధులను జమ చేశారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నిధులపై ‘కాగ్’ అడిగినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా తప్పించుకుంది. వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధపడాలి. రాష్ట్రమంతటా విస్తరించిన అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతిని అంచెలంచెలుగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. సాగునీటి శాఖలో చోటుచేసుకున్న అవినీతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. దాన్ని త్వరలో బయటపెడతాం. మర్రిచెట్టు ఊడల్లాగా ప్రభుత్వ అవినీతి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ పాకింది. పీడీ ఖాతాల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే సమాధానం చెప్పాలి. వాస్తవాలు ప్రజలకు తెలిసే వరకూ ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు. పీడీ ఖాతాల కుంభకోణాన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తెస్తాం. ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోంది. ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ దుష్ట రాజకీయం చేస్తోంది’’ అని జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. కరువొచ్చినా సర్కారుకు పట్టదా?: కన్నా రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి పెట్టకపోవడం దారుణమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కరువు మండలాలను గుర్తించి, రైతాంగాన్ని ఆదుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. కరువు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను టీడీపీ సర్కారు ఇంకా మొదలు పెట్టలేదని విమర్శించారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దల అండతోనే రాష్ట్రంలో అక్రమ మైనింగ్ భారీస్థాయిలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో క్వారీలో చోటుచేసుకున్న మరణాలను ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలన్నారు. -
2,900 కోట్లకు లెక్క చెప్పండి
* ‘ఏసీ’ బిల్లులపై అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో * లేదంటే మే జీతాల నిలుపుదల హెచ్చరిక * ఈ మొత్తంలో వ్యవసాయ శాఖ బిల్లులే రూ.1500 కోట్లు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తేదీకి ముందుగానే వేల కోట్ల రూపాయల ఏసీ (సంక్షిప్త ఆకస్మిక) బిల్లులు, పీడీ (వ్యక్తిగత డిపాజిట్లు) ఖాతాల్లోని సొమ్ముల లెక్క తేల్చాలని ఆర్థిక శాఖ అధికారులు, అకౌంటెంట్ జనరల్ నిర్ణయించారు. ఏసీ బిల్లుల రూపంలో లెక్కలు చెప్పకుండా ఉన్న రూ.2,900 కోట్లకు ఈ నెలాఖరులోగా లెక్కలు చెపుతూ డీసీ బిల్లులను (వివరణాత్మక బిల్లులు) సమర్పించాలని, లేదంటే మే నెల వేతనాలను నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ అన్ని శాఖలను హెచ్చరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ప్రత్యేకంగా సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఏకంగా రూ.2,900 కోట్ల ఏసీ బిల్లులకు లెక్కలు చూపకపోవడాన్ని కాగ్ ప్రమాదకర పరిస్థితి అంటూ వ్యాఖ్యానించింది. ఆర్థిక శాఖ ఈ విషయూన్ని తన మెమోలో ప్రస్తావించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇకనుంచి జూన్ 1వ తేదీ వరకు ఎటువంటి ఏసీ బిల్లులకు నిధులు మంజూరు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఇకనుంచి ప్రతి నెల వేతనాల బిల్లులు సమర్పించే అధికారి ఆయా శాఖలకు చెందిన ఏసీ బిల్లుల వివరాలను కూడా తెలియజేయాలని సూచించారు. అలా తెలియచేయని అధికారి వేతనాలను నిలుపుదల చేయాల్సిందిగా ఖజానా కార్యాలయ అధికారులను ఆదేశించారు. పలు శాఖలకు చెందిన రూ.2,900 కోట్ల ఏసీ బిల్లుల్లో ఒక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన బిల్లులే రూ.1500 కోట్ల వరకు ఉన్నాయి. అత్యవసర ఖర్చుల కోసం ఏసీ బిల్లుల కింద అధికారులు నిధులు డ్రా చేసుకుంటారు. అయితే వాటికి నెల రోజుల్లోగా డీసీ (వివరణాత్మక) బిల్లులను ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు, శాఖలకు సంబంధించిన 72 వేల పీడీ (వ్యక్తిగత డిపాజిట్లు) ఖాతాల్లో రూ.13,000 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మొత్తం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.