* ‘ఏసీ’ బిల్లులపై అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో
* లేదంటే మే జీతాల నిలుపుదల హెచ్చరిక
* ఈ మొత్తంలో వ్యవసాయ శాఖ బిల్లులే రూ.1500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తేదీకి ముందుగానే వేల కోట్ల రూపాయల ఏసీ (సంక్షిప్త ఆకస్మిక) బిల్లులు, పీడీ (వ్యక్తిగత డిపాజిట్లు) ఖాతాల్లోని సొమ్ముల లెక్క తేల్చాలని ఆర్థిక శాఖ అధికారులు, అకౌంటెంట్ జనరల్ నిర్ణయించారు. ఏసీ బిల్లుల రూపంలో లెక్కలు చెప్పకుండా ఉన్న రూ.2,900 కోట్లకు ఈ నెలాఖరులోగా లెక్కలు చెపుతూ డీసీ బిల్లులను (వివరణాత్మక బిల్లులు) సమర్పించాలని, లేదంటే మే నెల వేతనాలను నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ అన్ని శాఖలను హెచ్చరించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ప్రత్యేకంగా సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఏకంగా రూ.2,900 కోట్ల ఏసీ బిల్లులకు లెక్కలు చూపకపోవడాన్ని కాగ్ ప్రమాదకర పరిస్థితి అంటూ వ్యాఖ్యానించింది. ఆర్థిక శాఖ ఈ విషయూన్ని తన మెమోలో ప్రస్తావించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇకనుంచి జూన్ 1వ తేదీ వరకు ఎటువంటి ఏసీ బిల్లులకు నిధులు మంజూరు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.
ఇకనుంచి ప్రతి నెల వేతనాల బిల్లులు సమర్పించే అధికారి ఆయా శాఖలకు చెందిన ఏసీ బిల్లుల వివరాలను కూడా తెలియజేయాలని సూచించారు. అలా తెలియచేయని అధికారి వేతనాలను నిలుపుదల చేయాల్సిందిగా ఖజానా కార్యాలయ అధికారులను ఆదేశించారు. పలు శాఖలకు చెందిన రూ.2,900 కోట్ల ఏసీ బిల్లుల్లో ఒక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన బిల్లులే రూ.1500 కోట్ల వరకు ఉన్నాయి. అత్యవసర ఖర్చుల కోసం ఏసీ బిల్లుల కింద అధికారులు నిధులు డ్రా చేసుకుంటారు.
అయితే వాటికి నెల రోజుల్లోగా డీసీ (వివరణాత్మక) బిల్లులను ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు, శాఖలకు సంబంధించిన 72 వేల పీడీ (వ్యక్తిగత డిపాజిట్లు) ఖాతాల్లో రూ.13,000 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మొత్తం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.
2,900 కోట్లకు లెక్క చెప్పండి
Published Tue, Apr 8 2014 5:07 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement