సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని ఇదుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీన్ కురియాకోస్‌పై 193 కేసులు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఆ కేసుల వివరాలను ఎన్నికల ముందు కనీసం మూడు రోజులపాటు వార్తా పత్రికలు, కనీసం ఒక్క టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని సుప్రీం కోర్టు 2018లో ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మలయాళ పత్రిక ‘వీక్షణం’లో తనపై నమోదైన కేసులను వివరిస్తూ కురియాకోస్ ఎనిమిది పేజీల యాడ్ ఇచ్చారు. ఆ పత్రిక యాడ్ టారిఫ్ ప్రకారం ఆ యాడ్ కనీసంగా కోటి రూపాయలు అవుతుంది. ఈ ఒక్క కారణంగా ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయవచ్చు. ఎందుకంటే లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ఖర్చు 70 లక్షల రూపాయలు దాటవద్దు.
కురియాకోస్ యాడ్‌ను ఏప్రిల్ 17,18,19 తేదీల్లో పత్రికా ఇదుక్కి ఎడిషన్లో ప్రచురించారు. అలాగే ‘జైహింద్ టీవీ’ ఛానల్‌లో యాడ్‌ను ప్రసారం చేశారు. అయితే ఈ రెండు మీడియా సంస్థలు కాంగ్రెస్ పార్టీకే చెందినవి అవడం వల్ల యాడ్స్‌కు కేవలం 2.4 లక్షల రూపాయలు మాత్రమే చార్జి చేసినట్లు చూపించారు. తమ పార్టీ అభ్యర్థి అవడం వల్ల ఆ మాత్రం రాయితీ ఇవ్వక తప్పలేదని వీక్షణం పత్రిక అడ్వర్టయిజ్ విభాగం అధిపతి అనిల్ జార్జి తెలిపారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఇద్దరు యువజన కాంగ్రెస్ కార్యకర్తల హత్యకు నిరసనగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు సంబంధించే ఆయనపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
పట్టణంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్‌పై ఏకంగా 242 కేసులు ఉన్నాయి. ఆయన ‘జన్మభూమి’ పార్టీ పత్రికలో మూడు రోజుల పాటు కేసులకు సంబంధించిన యాడ్‌ను ఇవ్వడంతోపాటు ఆరెస్సెస్‌కు చెందిన ‘జనం టీవీ’ ఛానల్‌లో యాడ్ ఇచ్చారు. పత్రికలో వచ్చిన సురేంద్రన్ యాడ్‌కు టారిఫ్ ప్రకారం 40 లక్షల రూపాయలు అవుతుందని, అయితే ఇంకా బిల్లు చేయలేదని, పార్టీ నాయకత్వంతో మాట్లాడాక బిల్లును సెటిల్ చేస్తామని పత్రిక యాడ్ విభాగం అధిపతి శరత్ చంద్రన్ తెలిపారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించిన కారణంగానే ఆయనపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
ఇక పాలకపక్ష సీపీఎం పార్టీ ఎనిమిది మంది పార్టీ అభ్యర్థుల నేర చరితను వివరిస్తూ పార్టీ పత్రిక ‘దేశాభిమాని’లో ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో వరుసగా యాడ్స్ ఇచ్చింది. వాటి బిల్లు ఎంతయిందని పత్రికా యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, ఈ బిల్లును రూపొందించలేదని, ఎన్నికల అనంతరం బిల్లు సంగతి చూస్తామని చెప్పారు. అభ్యర్థు నేర చరితలకు సంబంధించిన యాడ్స్ బిల్లులను ఎన్నికల ఖర్చు పరిమితి నుంచి తప్పించాలని వివిధ పార్టీలు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కేసులు ఉన్నట్లయితే ఆ కేసుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలంటూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత ఎన్నికల కమిషన్ అమలు చేస్తోంది. గతంలో రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరమ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోను సుప్రీం తీర్పును ఎన్నికల కమిషన్ అమలు చేసింది. కేరళలో ప్రతి రాజకీయ పార్టీకి పత్రికలు, టీవీ ఛానళ్లు ఉండడం వల్ల ఎన్నికల పరిమితి వ్యయం నుంచి అభ్యర్థులు తప్పించుకోగలుగుతున్నారు.
కేరళ అభ్యర్థులపై వందల్లో కేసులు
Published Tue, Apr 23 2019 4:03 PM | Last Updated on Tue, Apr 23 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment