
బెంగళూరు: సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కొంతకాలం జర్నలిస్ట్‌గా పనిచేశానని సూపర్‌స్టార్ రజనీకాంత్ వెల్లడించడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఆయన బస్ కండక్టర్‌గా పనిచేశారన్న విషయం అందరికీ తెలుసు. జర్నలిస్ట్‌గా పనిచేశానని ఆయనే స్వయంగా చెప్పడంతో రజనీకాంత్ గురించి తెలియని విషయం మరోటి ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కూడా జర్నలిస్ట్‌గా పనిచేశా. కన్నడ జర్నలిస్ట్‌గా, సంయుక్త కర్ణాటక న్యూస్‌పేపర్‌లో వ్రూఫ్ రీడర్‌ను పనిచేశాన’ని చెప్పారు.
రజనీకాంత్ తమ సంస్థలో పనిచేయలేదని సంయుక్త కర్ణాటక దినపత్రిక యాజమాన్య సంస్థ ‘లోకశిక్షణ ట్రస్ట్’ తెలిపింది. ‘రజనీ సన్నిహిత మిత్రుడు రామచంద్రరావు మా న్యూస్‌పేపర్‌లో ప్రూఫ్ రీడర్‌గా పనిచేసేవారు. ఆయనను కలిసేందుకు రజనీకాంత్ మా కార్యాలయానికి వస్తుండేవారు. పనిలో తన స్నేహితుడికి సహాయం చేసేవారు. ఇదంతా అనధికారికంగా జరిగేది. దీనికి ఎటువంటి వేతనం చెల్లించలేదు. జర్నలిజం పట్ల ఆసక్తి ఉండటం వల్లే రజనీకాంత్ తన మిత్రుడికి పనిలో సహాయం చేసేవార’ని లోకశిక్షణ ట్రస్ట్ చైర్మన్ ఉమేశ్ వెల్లడించారు. తమ సంస్థతో రజనీకాంత్ అనుబంధం కలిగివుండటం గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనను తమ కార్యాలయానికి ఆహ్వానిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment