ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతోన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నామా నాగేశ్వర రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఖమ్మం: టీఆర్‌ఎస్ నుంచి ఖమ్మం ఎంపీ సీటు తనకు దక్కకపోవడంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలక వీడారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. 2013లో వైఎస్ జగన్ పిలుపుతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీగా 2014లో గెలిచానని చెప్పారు. దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రజాసమస్యలపై పోరాటం చేసి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, పాలన చూసి టీఆర్‌ఎస్‌లో చేరడం జరిగిందన్నారు.
ఆ సమయంలో 300 మంది సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనతో పాటు పార్టీలో చేరారని వెల్లడించారు. తనకు ఓటేసినందుకు ఖమ్మం జిల్లా ప్రజల రుణం కొంత తీర్చుకోగలిగానని చెప్పారు. ఈ ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వల్ల తనకు ఎంపీ సీటు ఇవ్వలేకపోయారని, అయినా కూడా కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొంత మంది పార్టీలు మారతారని పగటి కలలు కన్నారని, వేరే పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారని భావించారని అని కూడా అన్నారు. తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా పార్టీ మారనని ఇదివరకే కేసీఆర్, కేటీఆర్‌లకు చెప్పానని స్పష్టం చేశారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా జిల్లాలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఖమ్మం జిల్లాలో ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయని, దీనికి వేరే కారణాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాదరణ చూరగొన్న కేసీఆర్ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నలుగురు ఎంపీలతో దేవెగౌడ ప్రధాని కాగా లేనిది.. 16 మంది ఎంపీలతో కేసీఆర్ ప్రధాని కాలేడా అని ప్రశ్నించారు. ప్రధాని అయ్యే అర్హతలు కేసీఆర్‌కు ఉన్నాయన్నారు. ఖమ్మం టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావుకు బేషరుతుగా మద్ధతు ప్రకటిస్తున్నానని, కారు గుర్తు మీద ఓటేసి నామా నాగేశ్వర రావును గెలిపించాలని తన అభిమానులకు, టీఆర్‌ఎస్ పార్టీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment