
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సహనం కోల్పోయారు. ఒక కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నించడంతో ఆయనకు కోపం వచ్చింది. ఒక చేతిలో గొడ్డలి పట్టుకున్న ఆయన.. తల నరికేస్తానంటూ సదరు కార్యకర్తపై చిందులు తొక్కారు. ఇటీవల జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది.
యాత్రలో భాగంగా ఓపెన్ మినీ ట్రక్ టాప్‌పై నిలబడి ఖట్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఆయనకు గొడ్డలిని బహూకరించారు. గొడ్డలి ర్యాలీలోని ప్రజలకు చూపిస్తుండగా మరో కార్యకర్త ఆయన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఖట్టర్‌కు ఒక్కసారిగా కోపం వచ్చింది. అంతే, సదరు కార్యకర్తను ‘మెడ కొసేస్తా నీది’ (గార్దన్ కాట్ దూంగా తేరి) అంటూ హెచ్చరించారు. ఆ కార్యకర్త చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, ఈ వీడియోపై ఖట్టర్ స్పందిస్తూ.. కిరీటాలను తొడిగే రాజరిక సంప్రదాయానికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరమగీతం పాడిందని, ఎవరైనా కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నిస్తే తనకు కోపం వస్తుందని, దానిని సహించబోనని తెలిపారు. అయితే, కోపంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆ కార్యకర్త బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment