
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గోరక్షణకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మహిళల రక్షణకు ఇవ్వడం లేదని ఐద్వా మండిపడింది. దేశంలో పెరుగుతున్న అసహనపూరిత వాతావరణం, మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల సాధనకు ఐద్వా ఆధ్వర్యంలో సేవ్ ఇండియా పేరుతో శుక్రవారం ఢిల్లీలో సదస్సు జరిగింది. వివిధ రాష్ట్రాల్లో దాడులకు గురైన బాధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడుతూ.. గోవులను తరలిస్తున్నారన్న కారణంతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న హిందూత్వ శక్తులు.. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలపై దాడులను, అత్యాచారాలను నిరోధించడానికి ఏర్పాటు చేసిన నిర్భయ నిధిని ఖర్చు చేయకుండా.. గోరక్షణకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి భారీగా నిధులు వెచ్చిస్తున్నారని ఆమె మండిపడ్డారు. హిందుత్వం ముసుగులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. మహి ళల హక్కుల సాధనకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేస్తామని ఐద్వా సభ్యురాలు పుణ్యవతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment