సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉద్యమాల ఖిల్లా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా అయిన పూర్వ కరీంనగర్ జిల్లా నుంచే ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై అవిశ్వాసపర్వం మొదలైంది. టీఆర్‌ఎస్ ఏర్పాటు నుంచి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎంతో ఆదరించిన జిల్లాగా కరీంనగర్‌కు పేరుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఇక్కడి నుంచే. అయితే స్థానిక సంస్థల, ప్రజాప్రతినిధుల నాలుగేళ్ల పాలన ముగింపు సందర్భంగా ఎప్పటి నుంచో రగులుతున్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు అవిశ్వాసం నోటీసులు తెరపైకి వస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపైనే ఈ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటి మేయర్ సాగంటి శంకర్‌లపై కార్పొరేటర్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనకు శుక్రవారం అవిశ్వాసం నోటీసులు అందజేశారు. మొత్తం 50 కార్పొరేటర్లకు గాను 39 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును అందచేయడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది.
ఇందులో 10 మంది కాంగ్రెస్, ఒక బీజేపీ, 28 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. రామగుండం బల్దియాలో రెండేళ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ విభేదాలు నెలకొన్నాయి. ఏడాది నుంచి ఇవి మరింత ముదిరిపోవడంతో కార్పొరేటర్లు, పార్టీ రెండుగా చీలిపోయిన ఫలితమే అవిశ్వాసంగా చెబుతున్నారు.
హుజూరాబాద్ మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ వడ్లూరు విజయ్‌కుమార్‌పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. హుజూరాబాద్ నగర పంచాయతీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన విజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి ఈటల రాజేందర్ ఆశీస్సులతో చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఇటీవల అనేక అవినీతి ఆరోపణలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఆయనను పలుమార్లు మంత్రి ఈటల రాజేందర్ మందలించారు. ఇదే సమయంలో కౌన్సిలర్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉండగా, శుక్రవారం మొత్తం 20 మందిలో 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు.
వేములవాడ, కథలాపూర్ ఎంపీపీలపై కూడా..
టీఆర్‌ఎస్‌కు చెందిన వేములవాడ ఎంపీపీ వెంకటేశ్ గౌడ్‌పైన అదే పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు రాజన్న సిరిసిల్ల డీఆర్‌వో జీవీ శ్యాంప్రసాద్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అక్కడి నుంచి అటే క్యాంపునకు తరలి వెళ్లడం టీఆర్‌ఎస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కథలాపూర్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన తొట్ల నర్సుపైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఐదుగురు బీజేపీ, ఒక కాంగ్రెస్ ఎంపీటీసీ, ఆరుగురు టీఆర్‌ఎస్ సభ్యులు కలిసి మొత్తం 11 మంది ఈ నోటీసు ఇచ్చి క్యాంపునకు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment