
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డ టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాంపుల్లారెడ్డి సోదరులు కలిశారు. రాంపుల్లారెడ్డి సోదరులకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వంలో ఓ సైనికుడిగా పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేస‍్తామని ఆయన పేర్కొన్నారు. తమ కార్యకర్తలు కూడా తమబాటలోనే నడుస్తారని చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని, గంగుల కుటుంబంతో తమకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని రాంపుల్లారెడ్డి తెలిపారు. టీడీపీలో అవినీతి రాజ్యమేలుతోందని రాంపుల్లారెడ్డి విమర్శించారు. (వైఎస్ జగన్‌ను కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేతలు)
Comments
Please login to add a commentAdd a comment