విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య సమరం​ ఇది! | Its Battle Between Credibility, Opertunitism, Says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య సమరం​ ఇది!

Published Sat, Mar 2 2019 12:57 PM | Last Updated on Sat, Mar 2 2019 2:22 PM

Its Battle Between Credibility, Opertunitism, Says YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాదం, అవకాశవాద రాజకీయాలు పరాకాష్టగా మారిపోయారని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌ పార్టీల పొత్తును ఉదహరిస్తూ పేర్కొన్నారు. ఇండియా టుడే 18వ ఎడిషన్‌ క్లాన్‌క్లేవ్‌లో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన మీరు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారా? అని జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌ ప్రశ్నించగా.. కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయిందని, ఆ పార్టీ అవసరం తమకు లేదని, ఉంటే తమ అవసరమే ఆ పార్టీకి ఉండవచ్చునని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే.. వారికి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడో ఆవిరైపోయిందని, ఆ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి ఆశల్లేవని పేర్కొన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు అవినీతిపై ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఒక్క పుస్తకాన్ని విడుదల చేసిందని, దాని మీద రాహుల్‌గాంధీ బొమ్మ కూడా ఉందని గుర్తు చేశారు. చంద్రబాబును అత్యంత అవినీతిపరుడైన సీఎంగా అభివర్ణించిన కాంగ్రెస్‌ పార్టీ మూడు నెలలు తిరగకముందే తెలంగాణ ఎన్నికల్లో అదే టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళ్లిందని, ప్రజలు ఆ పార్టీలను ఓడించి పంచించారని తెలిపారు. గత ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేశామని, తనకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీ చేసినా, తాము కేవలం ఒక్క శాతం ఓట్లతో ఓడిపోయామని గుర్తుచేశారు.

రాజధాని పేరిట కుంభకోణం..
ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటున్నారు కదా ప్రశ్నించగా.. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. జూన్‌ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాజధాని ఎక్కడ వస్తుందో ఆయనకు ముందే తెలుసు. అయినా, ఇక్కడ వస్తుంది.. అక్కడ వస్తుందంటూ ఆయన ప్రజలు మభ్యపెట్టారు. ఈ లోపల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు తక్కువధరకు భూములు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి రాజధాని ఎక్కడ వస్తున్నదనేది రహస్యంగా ఉంచాలి. కానీ, చంద్రబాబు ఈ విషయాన్నితన వాళ్లకు ముందే లీక్‌ చేశారు. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో సమానం. ల్యాండ్‌ పూలింగ్‌ విషయలో చంద్రబాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట రాజధాని కోసం పేదల నుంచి మాత్రమే భూములు లాక్కున్నారు. తన బినామీల భూములు, తన భూములు ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి రాకుండా చూశారు. దేశం ఇలాంటి అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసిందా?

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి..
ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. బ్లాక్‌మనీతో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన సీఎంను మీరు ఎప్పుడైనా చూశారా? సిగ్గు లేకుండ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ.. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల్లో ఉన్నది ఆయన గొంతేనని ఫోరెన్సిక్‌ నివేదిక సైతం తేల్చింది. అయినా ఆయనపై కేసు నమోదు కాలేదు. రాజీనామా చేయలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎలాంటి నైతిక విలువలు లేకుండా వ్యవహరించారు. ఇదే చంద్రబాబు ఇప్పుడు అవినీతి అంటూ నీతులు చెబుతుంటే ఏమనుకోవాలి?

కేసుల గురించి..
‘మా నాన్న బతికి ఉన్నంతవరకు నా మీద కేసుల్లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పుయాత్ర చేస్తానని నేను ప్రకటించగానే.. నాపై కేసులు పెట్టారు. నా మీద కేసులు పెట్టినవారెవరో తెలుసా? టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేను బయటకు రాగానే.. ఆ రెండు పార్టీలు కలిసి నాపై కేసులు పెట్టాయి. మా నాన్న సంక్షేమ పాలన చూసి ఆ పార్టీ నేతలు భయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు కేంద్రంతో, రాష్ట్రంతో పోరాడితే కేసులు పెట్టడం చాలా సులభం. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారం చేతిలో ఉంది కాబట్టి నా మీద ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టారు. నా మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులు’ అని తన మీద నమోదైన కేసుల గురించి అడిగిన ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.

చదవండి: జాతీయ రాజకీయాల్లో మాది తటస్థ వైఖరి: వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement