
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని, ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడలో శనివారం టీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాను తెరాస కంచుకోటగా మార్చామని ఆయన తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటి కలలు కన్నారని విమర్శించారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని.. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యిందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల తీర్పుతో రాష్ట్ర ప్రజలు తెరాసవైపే ఉన్నారని తేలిపోయిందని మంత్రి అన్నారు. (సీపీ అంజనీ కుమార్‌పై విరుచుకుపడ్డ ఉత్తమ్)
గతంలో నల్గొండ జిల్లాలో అనేక మంది మంత్రులుగా చేసిన జిల్లాలో అభివృద్ధి జరిగిందేమి లేదని, కేవలం తెరాస పాలనలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. సొంత ఊరిని కూడా అభివృద్ధి చేసుకోలేదని విమర్శించారు. ప్రజల కోసం అనునిత్యం తపనపడే వ్యక్తిగా ఎమ్మెల్యే భాస్కర్ రావు ముందుటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే మిర్యాలగూడ రూపురేఖలు మారుతాయన్నారు. వార్డు సభ్యులుగా అవతలి పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. సోనియా గాంధీ, మోదీ సొంత రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి జగదీష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment