సాక్షి, సంగారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదన్న బాధతోనే మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మెప్పుకోసమే కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో నీకు తెలియకపోతే మీ మామని అడిగి తెలుసుకో అని ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రాజెక్టులు ఎవరు కట్టినా సమర్ధించాలని.. కేసీఆర్‌ని కూడా అదే విధంగా సమర్థించామని జగ్గారెడ్డి అన్నారు. కానీ హరీష్ రావు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
30 ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని హరీష్ రావు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నువ్వు నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.. కల్వకుర్తి, నెట్టంపాడు, ఎల్లంపల్లి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తుచేశారు. తాము కట్టిన ప్రాజెక్టుల నుంచి తాగు,సాగు నీరు ప్రజలకు అందాయన్నారు. 40 ఏళ్లుగా సింగూరు, మంజీరా నీళ్లు జనం తాగుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు మానుకోకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నీళ్లు తాగే నువ్వు పెద్దోడివి అయ్యవన్నది మర్చిపోయావా.. హరీష్? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment