పాట్నా: బిహార్‌లో రానున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు ఉదృతం కానుంది. రాజ్యాంగ నిర్మాత భీంరామ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ఆదివారం పాట్నాలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. దళితుల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో రాష్ట్రీయ జనతా దళ్ నిర్వహించిన ఈ సభకు సుమారు మూడు లక్షలకు పైగా పార్టీ కార్యకర్తలు హాజరైనట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సభ ప్రారంభమవ్వగానే ‘జైభీం- జై మండల్’ నినాదాలతో సభ ప్రాంగణం హోరెత్తింది. సభకు హాజరైన తేజస్వీ యాదవ్ కూడా వారికి మద్దతుగా జైభీం అనే నినాదాలు చేశారు. కాగా రానున్న బిహార్ శాసనసభ ఎన్నికల్లో జైభీం వర్సెస్ జైశ్రీరాం నినాదాల మధ్య ఎన్నికల యుద్దం జరుగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేశిస్తున్నాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, పుల్‌పూర్ ఉపఎన్నికల్లో బీఎస్‌పీ-ఎస్‌పీలు కూటమిగా జట్టుకట్టి, అధికార పార్టీని చావుదెబ్బతీసిన విషయాన్ని ఆర్‌జేడీ గుర్తుచేసుకుంది. దళిత వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డ బీజేపీని ఓడించాలంటే దళిత ఓటర్లకు దగ్గర అవ్వటమే ప్రధాన ఆయుధమని ఆర్‌జేడీ భావిస్తోంది. ఈ బహిరంగ సభలో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దళితులపై, మైనారిటీలపై, దాడులు చేస్తోందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జేడీయులను ఓడించేందుకు ఆర్జేడీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా దళితులు ఆధిపత్యం ఉన్న ప్రాంతాలపై ఆర్జేడీ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment