
చినకొండేపూడి పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి, సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులను, రఘుదేవపురంలో వరి కుప్పలు కాలి నష్టపోయిన అన్నదాతలను రెండు వారాల్లో ఆదుకోకుంటే ఈ నెల 19న రఘుదేవపురం పంచాయతీలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అల్టిమేటం జారీచేశారు. బుధవారం చినకొండేపూడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో ఇంకా 55 మంది రైతులకు పరిహారం అందించాల్సి ఉందన్నారు. రెండేళ్ల క్రితం రఘుదేవపురంలో 30 ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయని, సుమారు 40 మంది రైతులు పూర్తిగా నష్టపోయారని వివరించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు ప్రభుత్వం అందించే పరిహారం తక్షణమే అందించాలని, రఘుదేవపురంలో వరి కుప్పలు కాలిపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రెండు వారాల్లో రైతులను ఆదుకోని పక్షంలో ఈ నెల 19న రఘుదేవపురం పంచాయతీలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కాపు కార్పొరేషన్ రుణాలకు రెండువేల మంది దరఖాస్తు చేసుకున్నారని, మండలంలో రూ.2.96 కోట్లు రాగా, కేవలం 200 మందికి రుణాలుగా ఇచ్చారన్నారు. మిగిలిన అర్హులు ప్రశ్నిస్తారని భయపడి వచ్చిన నగదును రుణాలుగా ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్పొరేషన్ రుణాలు పొందేవారి నుంచి రూ.5 వేలు చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రఘుదేవపురంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు టీడీపీకి చెందిన వారైనా ఎటువంటి అభివృద్ధి కానరావడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు రాజకీయాలను ఆదాయ వనరులుగా మార్చుకుని, ఇసుక, మట్టి, లంచాలతో నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని రాజా దుయ్యబట్టారు. పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంచ బాబురావు, గెద్దాడ త్రిమూర్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment