సాక్షి, విజయవాడ : గత పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వందరోజుల పాలన మీద జనసేన ఇచ్చిన నివేదికపై జనచైతన్య వేదిక స్పందించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తీసుకున్న దశలవారీ మద్యనిషేధం, ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సోమవారం పవన్కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు బెల్టు షాపులను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారించారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్టుషాపుల భరతం పట్టి గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి బాటలు వేశారని గుర్తుచేశారు.
సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనిని స్వాగతించక పోగా పవన్ వక్రభాష్యాలు చెప్పటం భావ్యం కాదని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, ఈ అవినీతిపై వైఎస్సార్‌సీసీ ప్రభుత్వం విచారణ చేస్తామంటే పవన్ అభ్యంతరం చెప్పటం సరైనదికాదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను సమీక్షించుకోవాలని అన్నారు. రాజకీయం చేయకుండా మద్యపాన నిషేధానికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. బిహార్ ,గుజరాత్, మిజోరాం వంటి రాష్ట్రాలలో సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు జరుగుతోందని, ఏపీలో భవిష్యత్తులో అదే జరుగుతుందని లక్ష్మణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment