సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జానారెడ్డికి కోపం వచ్చింది. ఎలాంటి పరిణామాలనైనా నిబ్బరంగా ఎదుర్కొని నిదానంగా మాట్లాడే ఆయన తన సహజశైలికి భిన్నంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ అధినేత తనకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటలు కరెంటిస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని అసెంబ్లీలో చెప్పినట్లు శుక్రవారం హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి వాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నాకు నిజాయితీ ఉంటే కండువా కప్పుకోవాలంటుండు.. నేను అనని మాటలు నాకు ఆపాదించడమేంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనే మాటలేనా ఇవి. నేనెప్పుడూ అలా అనలేదు. అనను. అవసరమైతే అసెంబ్లీ రికార్డులు పరిశీలించండి. నేను అన్నట్లు మీరు రుజువులు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి’’అని జానారెడ్డి డిమాండ్ చేశారు.
పొద్దున ఒకటి, రాత్రి ఒకటి మాట్లాడే రకం కాదు..
రెండు పంటలకు నీరిచ్చి, కోటి ఎకరాలు సాగులోనికి తెస్తే తాను టీఆర్‌ఎస్ ప్రచారకర్తగా ఉంటానని అన్నానని, దానికి కట్టుబడి ఉంటానని జానారెడ్డి చెప్పారు. కానీ, రెండు పంటలకు నీరు ఎక్కడ వస్తుందో చూపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కానీ, ఎత్తిపోతల పథకాలు కానీ ఉద్దేశించిందే ఒక్క పంటకు నీళ్లివ్వడానికని చెప్పారు. తాను అనని మాటలను అన్నానని చెప్పడం ద్వారా కేసీఆర్ తన స్థాయి తగ్గించుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పెంచాలే కానీ, అబద్ధాలతో విలువలు తగ్గించవద్దని హితవు పలికారు. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి మాట్లాడే రకం తాను కాదని, జానారెడ్డి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అంటూ ఆవేశంలో ఊగిపోతూ అన్నారు. విలేకరుల సమావేశంలో భాగంగా 2లక్షల ఇండ్లు కట్టించకపోతే తాను ఓట్లడగబోనని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఫుటేజీ రికార్డులను ఆయన మీడియాకు చూపెట్టారు.
నిరూపించు.. లేదంటే క్షమాపణ చెప్పు
Published Sun, Sep 9 2018 1:39 AM | Last Updated on Sun, Sep 9 2018 1:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment