మీడియాతో మాట్లాడుతున్న జానా. చిత్రంలో భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం ముందుగానే చెప్పలేమన్నారు. ‘‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఎన్ని సీట్లు అన్నది అంచనా వేయలేం. అది 70 కావచ్చు... 60 కావచ్చు, 59 కావచ్చు. సీట్లు ఎన్నొచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. కర్ణాటకలో కేవలం 38 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే తరహాలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’అని జానారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతో కలసి జానారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ విసిరిన సవాల్‌పై ఆయన స్పందించారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్ హాస్యాస్పదమన్నారు. అయినా ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా ఐదేళ్లు ఉండాల్సిందే. కానీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు, విపత్తులు ఏర్పడితే ముందస్తు ఎన్నికలకు వెళతారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాలతో కలసి ముందస్తుకు పోదామని అనుకుంటోంది. కేంద్రం ఆలోచనలో భాగంగా తెలంగాణ సైతం ముందస్తుకు పోవాలని భావిస్తున్నట్లుంది. అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఎందుకు వెళుతున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వివరణ ఇచ్చి ఆ తర్వాత ముందస్తుకు వెళ్లాలి’’అని జానారెడ్డి సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము అందుకు సిద్ధంగా ఉంటామన్నారు.
పీసీసీ మార్పు ఉందనుకోను...
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి మార్పు అంశాన్ని జానారెడ్డి కొట్టిపారేశారు. పీసీసీ మార్పు ఉందని తనకు సమాచారం లేదని, మార్చేలా అధిష్టానం ఆలోచనలు చేయడం లేదని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్ తిరిగి పార్టీలోకి వస్తున్నారన్న సమాచారం తనకు తెలియదని జానారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న దానం నాగేందర్ వ్యాఖ్యలు అబద్ధమని ఆయన కొట్టిపారేశారు.
గద్వాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా తమ పార్టీ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని జానారెడ్డి ఖండించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడుపుతామనుకోవడం అవివేకం అన్నారు. నియంతృత్వ దేశాల్లో కూడా ఇంతటి నిర్బంధం లేదని విమర్శించారు. సమస్యల గురించి ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనించాలని కోరారు. రేషన్ డీలర్లపై ప్రభుత్వ చర్యలను జానారెడ్డి ఖండించారు. వారి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోకుండా కఠిన చర్యలకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. డీలర్లను చర్చలకు పిలిచి సామరస్యంగా వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.
సంపత్ హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం: భట్టి
ఎమ్మెల్యే సంపత్ కుమార్ హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విమర్శించారు. గత పుష్కరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సంపత్ మెమొరాండం ఇవ్వాలనుకుంటే ఆయన్ను పోలీసు నిర్బంధంలో ఉంచడం దారుణమని, దీన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామికవాదులందరూ దీన్ని ఖండించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment