సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో తన కంటే అర్హులెవరూ లేరని, తనను కాదంటే ప్రజలు కూడా అంగీకరించబోరని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం తన నివాసంలో జరిగిన సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎప్పుడూ తన మనసులో మాటలను బయటకు పంచుకోని ఆయన పలు అంశాలపై అభిప్రాయాలను నిర్మొహమాటంగా మీడియాతో పంచుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నిర్వర్తించేందుకు కూడా తనకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు.
గతంలోనే ఆ పదవి రావాల్సి ఉన్నా రాలేదని, అయినా పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచనతోనే తానెప్పుడూ నోరెత్తలేదని చెప్పారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనది కీలకపాత్ర అని, సోనియా గాంధీని ఈ విషయంలో ఒప్పించి రాష్ట్రం ఇప్పించింది కూడా తానేనని అన్నారు. ఈ విషయం ప్రజలకు తెలియడం కన్నా సంతోషం ఏముంటుందని అన్నారు. తనకు అర్హత ఉన్నప్పటికీ సీఎం పదవి రాకపోయినా ఫర్వాలేదని, తెలంగాణ ఇప్పించానన్న సంతృప్తి చాలని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ పదవుల కోసం పాకులాడ లేదని చెప్పారు. ఆరునెలల ముందు తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ప్రయోజనం జరిగి ఉండేదనే అభిప్రాయంపై స్పందిస్తూ ‘అప్పటి పరిస్థితులు వేరు. 25 మంది ఎంపీలు బయటకు వెళ్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే తెలంగాణే వచ్చేది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించి చివర్లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’అని జానా చెప్పుకొచ్చారు.
సీఎల్పీ పనితీరుపై ..
సీఎల్పీ సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణపై జానా తనదైన శైలిలో స్పందించారు. ‘క్రికెట్‌లో టీం కెప్టెన్ సెంచరీలు కొట్టినా అన్నిసార్లు మ్యాచ్‌లు గెలవలేరు. లీడర్ టెన్ రన్స్ కొట్టినా జట్టు సభ్యుల ప్రదర్శన బాగుంటే మ్యాచ్‌లు గెలవచ్చు. మా స్పిరిట్ కూడా అంతే’అని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలను బహిష్కరించిన విషయంలో పోరాటం చేస్తున్నామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌ను సుప్రీంకోర్టులో సాక్ష్యంగా చూపేందుకే తాము రాజ్యసభ బరిలో నిలిచామని చెప్పారు. ఎలిమినేటి మాధవరెడ్డి, పట్లోళ్ల ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి ఎంతోమందికి తానే రాజకీయబాట చూపించానని, అయినా తానెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని జానారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment