
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా జనసేనతో కలిసి ఫిబ్రవరి 2న నిర్వహించ తలపెట్టిన లాంగ్‌మార్చ్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీజేపీ ప్రకటించింది. త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న జరగాల్సిన రెండు పార్టీ నేతల సమావేశం కూడా వాయిదా పడింది. (నిమిషాల వ్యవధిలో మాట మార్చిన పవన్)
ఢిల్లీ నాయకత్వం మొట్టికాయలు..!
లాంగ్‌మార్చ్ వాయిదా వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం మొట్టికాయలు వేయడమే కారణమని ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలో దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల నేతలకు సూచించింది. అయితే రాష్ట్రంలో ఆ కార్యక్రమాల్ని పక్కనపెట్టి స్థానిక నేతల సొంత అజెండా ప్రకారం వెళ్లడంపై జాతీయ నాయకత్వం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. (పవన్కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!)
సీఏఏపై అవగాహన కార్యక్రమాలు మరో పది రోజులు కొనసాగించాలని బీజేపీ పెద్దలు సూచించారు. అయితే రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమాలు జరగకపోవడాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం తప్పుపట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శనివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో పది రోజుల పాటు సీఏఏపై ప్రజలలో అవగాహన కలిగించే కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment