![Women Fires on Janasena Kiran Royal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/13.jpg.webp?itok=xUJ-kU5s)
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఆధునిక సమాజంలో ఆడవారికి ఆకాశంలో సగం అంటూ అగ్రపీఠం వేశారు. అయితే కొందరు మాత్రం మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. మళ్లీ ఆటవిక యుగంలోకే నెట్టేస్తున్నారు. ఇదే కోవలో జనసేన తిరుపతి ఇన్‌చార్జి కిరణ్ రాయల్ వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ వారి పార్టీ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుయాయుడు మాత్రం అతివల జీవితాలతో ఆడుకుంటున్నారు. ‘చిల్లర’ వేషాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కల్లబొల్లి కబుర్లతో లోబరుచుకుని రూ.కోట్లు కాజేస్తున్నారు. ప్రశ్నించిన వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన సదరు కిరణ్‌వారు.. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో స్వప్రకటిత నేతగా హల్‌చల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకుంటూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘జనసేన తిరుపతి ఇన్‌చార్జి కిరణ్‌రాయల్ నా జీవితం నాశనం చేశాడు. రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు. నన్ను అప్పుల పాలు చేసేశాడు. అడిగితే మమల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’’ అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో.. వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జనసేనలో సదరు కిరణ్‌రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ పారీ్టకి తలనొప్పిగా మారాయి. దీనిపై పవన్‌కల్యాణ్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. కిరణ్ రాయల్‌పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
ఒక్కొక్కటి వెలుగులోకి..
కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు ఒక్కోక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నమ్మించి మోసం చేసిన కిరణ్ రాసలీలల భాగోతాన్ని బాధిత మహిళ బట్టబయలు చేసింది. మరో వివాహితతో సైతం కిరణ్ శారీకర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పారీ్టలోని ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పార్టీ పదవులను పావులుగా చూపి లోబరుచుకున్నట్లు నగరంలో సైతం చర్చ జరుగుతోంది. కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనలా కిరణ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకురావాలని, మహిళలను మోసగించే దుర్మార్గుడికి శిక్షపడేందుకు ఆధారాలు ఇవ్వాలని లక్ష్మి కోరుతున్నారు.
మాయమాటలతో మహిళలకు వల!
తనకున్న మాటకారితనం, హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడు. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. అందులో భాగంగా తన పక్కింటిలో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. చివరకు ఆ కుటుంబం విడిపోవడానికి కారకుడయ్యాడు. అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదలి కిరణ్ వెంట నడిచింది.
రాజకీయంగా ఎదుగుతున్న తనకు ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా రూ.1.32కోట్ల నగదును చేయి బదులుగా తీసుకున్నట్లు ఆ మహిళ ఆధారాలను బయటపెట్టింది. దీంతో పాటు 300గ్రాముల బంగారు నగలను కాజేశాడని వెల్లడించింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇద్దరి మహిళల మధ్య చిచ్చురేగింది. దీనిపై నిలదీయడంతో లక్ష్మీని దూరం పెడుతూ వచ్చాడు. నిన్ను నమ్ముకుని సర్వస్వం నీకే ఇచ్చేశాను.. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడింది.
నా బిడ్డలు అనాథలయ్యారని లక్ష్మి వేడుకున్నా కఠిన మసస్తత్వం కరగలేదు. దీంతో ఆమె తనకు ఇవ్వాల్సిన నగదు బంగారం తిరిగి ఇవ్వాలని కిరణ్‌ను అడగడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించి, పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెపై నేరుగా దాడి చేసినట్లు వాయిస్ రికార్డులో కిరణ్ ఒప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిన్ను చంపి బెయిల్‌పై తిరిగొస్తా.... నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తా... నీలాంటి వాళ్లను చాల మందిని చూశా... నా వెంట్రుక కూడా ఏవరూ పీకలేరు...నీవల్ల ఏమవుతుందో అది చేసుకో...అంటూ దారుణంగా మాట్లాడిన ఆడియో, వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
సస్పెన్షన్‌కు రంగం సిద్ధం!
సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడతానని, మహిళలకు రక్షణ కవచంలా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి జనసేన ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ వికృత పోకడలపై వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళను చంపేస్తానంటూ బెదిరించిన కిరణ్ రాయల్‌ను పార్టీ నుంచి నేడో, రేపో సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆధారాలు వెలుగు చూసినా పార్టీ అధిష్టానం రెండు రోజులుగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సైతం కిరణ్‌రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు స్పష్టం చేశారు.
ఎవరీ కిరణ్?
కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్‌లో టెకెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు అతను కిరణ్‌గానే అందరికీ పరిచయం. కిళ్లీ కొట్టులో మాదకద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెగా ఫ్యాన్‌గా చిన్నపాటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్‌కు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు. ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. తదనంతరం కిరణ్ ‘‘రాయల్’’గా అవతరించాడు. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఆపై పవన్‌కల్యాణ్‌కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు. తిరుపతిలో ఆ పారీ్టలో చేరేందుకు ముఖ్యనేతలెవ్వరూ మొగ్గు చూపకపోవడంతో కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు.
దర్శన టికెట్లలో అవినీతి
తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజులల్లో కిరణ్ అక్రమాల భాగోతం తిరుమలకు పాకింది. తన అభిమాని కావడం, పార్టీ వ్యవహారాలు చూస్తుండడంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్‌రాయల్ అక్రమంగా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి చెవిన పడడంతో ఆయన పలు మార్లు కిరణ్‌ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం పాటు కిరణ్‌ను పక్కన పెట్టారు. నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడు. తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో ఆయనపై పలు కేసులు నమోదవడం గమనార్హం.
‘గో బ్యాక్ ఆరణి అంటూ’..
జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరం అంతా ‘గోబ్యాక్ ఆరణి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది. జనసేనలోనే ఉంటూ ఆ పారీ్టకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ముఖ్యనేతలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్ అసోసియేషన్ నేత కావడంతో మందలించి వదిలేశారు. ఎన్నికలలో ఆరణికి వ్యతిరేకంగా పనిచేశాడని ఆధారాలతో సహా పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చాడు. మళ్లీ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే ఇంటి వైపునకు వెళ్లివస్తున్నాడు. ఇంతలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పారీ్టలో సంచలనంగా మారింది. అలాగే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. అసభ్యంగా దూషిస్తూ తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ ఈఓ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్‌ను సైతం బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment