సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాజు రవితేజ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ సన్నిహితుడు అయిన ఆయన శుక్రవారం జనసేనకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజు రవితేజ శనివారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కల్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని విమర్శించారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని రవితేజ వెల్లడించారు. కానీ, తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా పవన్ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని వాపోయారు. పవన్ వైఖరి మునుపటిలా లేదని.. అందుకే పార్టీని వీడినట్టు రాజు రవితేజ వెల్లడించారు.
ఆయన పూర్తిగా మారిపోయారు..
క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ లేదని రవితేజ అన్నారు. పార్టీలో అంతర్గతంగా పారదర్శకత లేదని విమర్శలు గుప్పించారు. పవన్ సొంత పార్టీ వాళ్లను పైకి రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వేదికను ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీలోని సీనియర్లు సంతోషపడ్డారని రవితేజ గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ బాష పూర్తిగా మారిపోయిందని ...ఇది సమాజానికి ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కులాల మీద పవన్ అనవసరంగా మాట్లాడుతున్నారని రవితేజ పేర్కొన్నారు.
అధికారం కోసం పవన్ తొందర పడుతున్నారని విమర్శించారు. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని.. కానీ, అందుకు భిన్నంగా పార్టీలో పరిస్థితి దాపురించిందని వాపోయారు. పవన్ సున్నితమైన మనిషని.. కానీ, తలలు నరికేస్తానని పార్టీకి చెందిన ఒక కార్యకర్త అన్నప్పుడు దానిని ఖండించలేదని గుర్తు చేశారు. గతంలో పార్టీకి రాజీనామా చేసానని, కానీ, మళ్లీ తిరిగి పార్టీలో జాయిన్ అయ్యానని రవితేజ తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీలో తిరిగి చేరనని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం బయటపడిందని రవితేజ అన్నారు. జనసేన పార్టీలో స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. అంతా తన కంట్రోల్ ఉండాలని పీకే కోరుకుంటారని ఆయన విమర్శించారు.
అంతకు ముందు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి ప్రవేశించామో మీరే ఆ వ్యాధిగా మారారు. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా.. పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని మీరు కోరారు. దాదాపు 12 ఏళ్లు మీ వెన్నంటే నడిచాడు. పార్టీకి సంబంధించి అన్ని విషయాల్లో మీతో చర్చించాను. పార్టీ కోసం ఎంతో చేశాను. మరెంతో చేద్దామనుకున్నాను. కానీ, మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి. హద్దుల్లేని అబద్ధాలతో మీ వ్యక్తిగత అహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటున్నారు. మీరు చేసే ప్రసంగాలు అబద్ధాలు, అసభ్యకర భాషతో ఉంటున్నాయి. మీరెప్పుడూ ధర్మవంతమైన మనిషిగా కాలేరు. ఒక మంచి మనిషి నుంచి నిజాయితీలేని, కుట్రపూరితమైన మనిషిగా మారారు’అని రాజు రవితేజ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment