ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక రాంపూర్ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిరోజూ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్‌రే నోరారా పొగిడిన భూలోక సుందరి (ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్) జయప్రద ఇక్కడి నుంచే పోటీ చేయడం రాంపూర్ ప్రత్యేకత. మరో అంశం.. స్త్రీలపై అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల వ్యవస్థనే కించపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ వ్యవహార శైలి కూడా రాంపూర్ నియోజకవర్గానికి మరో రకమైన అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఒకనాటి అన్నాచెల్లెలు బం«ధానికి ప్రతీకగా ఉన్న రాంపూర్.. ఎన్నికల సమరంతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. హోరాహోరీ ఎన్నికల పోరులో తాడోపేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఇటు బీజేపీ, అటు ఎస్పీ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే రాంపూర్ పోరులో మాత్రం పార్టీల కంటే పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో రాంపూర్ నియోజకవర్గంపై రాజకీయ నిపుణులు, విశ్లేషకులు దృష్టి సారించారు.
పదకొండు సార్లు ముస్లింలకే పట్టం
1957లో ఈ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు, బీజేపీ మూడుసార్లు, ఎస్పీ రెండుసార్లు గెలిచాయి. భారతీయ జనతాదళ్ ఒకసారి (1977)లో గెలిచింది. మొత్తం 11 సార్లు ముస్లిం అభ్యర్థులే ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మహిళలకు సైతం నాలుగు సార్లు పట్టం కట్టారు. ఈసారి కూడా ‘సన్ ఆఫ్ ద సాయిల్’ ఆజంఖాన్‌కు గట్టిపోటీ ఇస్తూ, దక్షిణ భారత చిత్రసీమను ఏలిన ఒకనాటి అందాలతార జయప్రద ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎస్పీ నుంచి ఆజంఖాన్, కాంగ్రెస్ నుంచి సంజయ్ కపూర్ (బిలాస్‌పూర్ ఎమ్మెల్యే) పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ నాటి మిత్రులూ, నేటి బద్ధ శత్రువులైన జయప్రద – ఆజంఖాన్ మ«ధ్యనే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
గత ఎన్నికల్లో కొద్దిలో గెలిచిన బీజేపీ
ఈ లోక్‌సభ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో రెండు కాంగ్రెస్, రెండు ఎస్పీ, ఒకటి బీఎస్పీ ప్రాతినిధ్యంలో ఉన్నాయి. జయప్రద గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో జయప్రద బీఎస్పీ టికెట్‌పై రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రత్యర్థి ఆజంఖాన్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ నేపాల్ సింగ్, 2014లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నజీర్ అహ్మద్‌ఖాన్‌పై, 23 వేల స్వల్ప ఆధిక్యతతో గెలవగలిగారు. గత ఎన్నికల్లో బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఎస్పీ, బీఎస్పీ పొత్తుపెట్టుకుని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆజంఖాన్‌ని పోటీకి దింపాయి.
వైరం ఎక్కడ మొదలైంది?
పదిహేనేళ్ల క్రితం జయప్రదను ముంబై నుంచి రాంపూర్‌కి రప్పించిన వ్యక్తి, సమాజ్‌వాదీ పార్టీకి పరిచయం చేసిన మిత్రుడు ఈ రోజు ఆమెకు బద్ధ శత్రువుగా ఎలా మారిపోయాడన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తనను నాడు పరిచయం చేసిన ఆజంఖాన్‌ను జయప్రద గౌరవంగా అన్నా అని సంబోధించే వారు. ఆయనను గురువుగానూ భావించారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉండగా ఆజంఖాన్ – అమర్‌సింగ్ మధ్య తలెత్తిన వైషమ్యాల సందర్భంగా జయప్రద అమర్‌సింగ్ పక్షం వహించడం వీరిద్దరి మధ్య అగ్గి రాజేసింది. అప్పటి నుంచి ఒకనాటి మిత్రులు బద్ధ శత్రువులుగా మారిపోయారు. తదనంతర పరిణామాల్లో అమర్‌సింగ్, జయప్రదను సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2014 ఎన్నికల్లో బిజ్నోర్ నియోజకవర్గం నుంచి ఆర్‌ఎల్డీ తరఫున పోటీ చేసి జయప్రద ఓడిపోయారు.
ఆజంఖాన్‌కిది అలవాటే..
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండటం ఆజంఖాన్ నైజం. అయితే ఈసారి జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల కారణంగా 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆజంఖాన్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే గతంలో సైతం తన చిత్రాలను మార్ఫింగ్ చేశాడంటూ ఆజంఖాన్‌పై జయప్రద ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు సైతం ఆమెపై వ్యక్తిగతంగా చౌకబారు వ్యాఖ్యలు చేయడం మరోమారు ఆజంఖాన్‌ని అభాసుపాలు చేసింది. ఇప్పుడు తాజాగా ఆమెపై ఆజంఖాన్ ‘పదిహేడేళ్లుగా చూసినా మీకర్థం కాని విషయం నాకు 17 రోజుల్లోనే అర్థమైంది. జయప్రద ఖాకీ నిక్కరు ధరించింది’ అంటూ అంతర్లీనంగా ఆమె ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అంటూ స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం అక్కడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసింది. పైగా తనపై యాసిడ్ దాడికి ఆజంఖాన్ కుట్ర పన్నాడన్న జయప్రద ఆరోపణలు ఇక్కడి రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయి.
సామాజిక సమీకరణలు
పదకొండు సార్లు ముస్లింలకే పట్టంగట్టిన ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా సగానికి పైగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 50.57 శాతం ఉన్నారు. హిందువులు 45.97 శాతం, సిక్కులు 2.80 శాతంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాంపూర్ అక్షరాస్యత 53.34 శాతం మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ.
రాంపూర్ ముఖచిత్రం
మొత్తం ఓటర్లు 11,54,544
పురుషులు 6,22,769
స్త్రీలు 5,31,775
పురుషుల అక్షరాస్యత 61.50%
మహిళల అక్షరాస్యత 44.44%
Comments
Please login to add a commentAdd a comment