
లక్నో : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను తను అన్నా అని పిలిస్తే.. అతను మాత్రం తనని నాట్యగత్తె అని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు జయప్రద. ఆ తర్వాత ఎస్పీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తీరుతో ఆమె పార్టీని వీడారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆజం ఖాన్.. నేను నిన్ను అన్నా అని పిలిచాను. కానీ నువ్వు నన్ను అవమానించావు. నన్ను నాట్యగత్తె అన్నావు. నిజమైన సోదరులు ఎవరూ అలా మాట్లాడరు. నీ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను’ అన్నారు.
పద్మావత్ సినిమా చూసిన తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఖిల్జీ పాత్రను చూస్తే నాకు ఆజం ఖానే గుర్తుకు వచ్చాడు. గత ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సమయంలో అతను నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు’ అని పేర్కొన్నారు. జయప్రద వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్ ఆమెను నాట్యగత్తె అని సంభోదించిన సంగతి తెలిసిందే.