బెదిరించే కళ్లు.. ఒళ్లంతా కుళ్లు! | JC Brorhers Fires On Police Department In Front Of DSP | Sakshi
Sakshi News home page

బెదిరించే కళ్లు.. ఒళ్లంతా కుళ్లు!

Published Mon, Mar 25 2019 8:25 AM | Last Updated on Mon, Mar 25 2019 8:25 AM

JC Brorhers Fires On Police Department In Front Of DSP - Sakshi

పోలీసులు కొజ్జాలని డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఎదుటే దూషిస్తున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, తాడిపత్రి అర్బన్‌: రెండునర్న దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జేసీ సోదరులు రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీలో చేరారు. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్‌రెడ్డి గెలవడం.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వారి   అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. తమ స్వార్థం కోసం నదులను చెరబట్టారు. ఇసుకను తోడేసి రూ.కోట్లు పిండేశారు. ప్రజాప్రతినిధులైన వారే దగ్గరుండి మరీ మట్కాతో పాటు పేకాట కేంద్రాలను నడిపించారు. ఇక జేసీ ట్రావెల్స్‌ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. ఇలా చెప్పుకుంటూపోతే జేసీ బ్రదర్స్‌ అరాచకాలు కోకొల్లలు.  

సొంతూర్లోనూ అరాచకమే.. 
జేసీ బ్రదర్స్‌ అరాచకాలకు వారి సొంత గ్రామమైన జూటూరు రైతులు కూడా బలయ్యారు. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల క్షేత్రానికి అవసరమైన భూములను రైతులను భయపెట్టి, వేధించి అతితక్కువ ధరకే స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాట వినకపోతే ఎక్కడ చంపేస్తారోననే భయంతో రైతులంతా వారు ఇచ్చింది తీసుకుని భూములు అప్పగించారు. అంతేకాకుండా బ్రోకర్లను నియమించుకుని అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రశ్నిస్తే కేసులే.. 
తమ అరాచకాలను ఎవరు ప్రశ్నించినా జేసీ బ్రదర్స్‌ తట్టుకోలేరు. అది సొంత పార్టీ నేతలైనా సహించలేరు. ఈ క్రమంలోనే చాలా మంది టీడీపీ నేతలను కూడా అక్రమ కేసుల్లో ఇరికించారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరుతో డబ్బులు డిమాండ్‌ చేశారని, తాము ఇవ్వకపోవడంతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి మరీ ఇబ్బందులకు పెడుతున్నారని గ్రానైట్‌ పరిశ్రమల యాజమానులు వాపోతున్నారు. పట్టణంలో ఎక్కువగా మట్కా కంపెనీలు జేసీ సోదరుల అండతోనే నడుస్తుండటం గమనార్హం. 


 

  • 2016లో నవంబర్‌లో టీడీపీ కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సుమారు రూ.200 కోట్లపైగా అవినీతికి పాల్పడ్డారని కౌన్సిల్‌ సమావేశంలోనే ఎత్తిచూపారు. దీంతో జేసీ పీఆర్‌ సొంత పార్టీ కౌన్సిలర్‌ అని కూడా చూడకుండా అతన్ని కౌన్సిల్‌ నుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేయించారు. జేసీ సోదరుల అవినీతిపై గళం వినిపించిన జగ్గీ బ్రదర్స్‌పై కూడా జేసీ సోదరులు పగబట్టారు. రెండు దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకున్న జగ్గీ బ్రదర్స్‌ను పార్టీని నుండి సస్పెండ్‌ చేయించారు.  
  • ప్రధాన అనుచరుడైన కాకర్ల రంగనాథ్‌ జేసీ సోదరులను వ్యతిరేకించారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ సోదరులు 2018లో జనవరిలో అతని సమీప బంధువు, శేఖర్‌కు చెందిన ‘అన్నా ట్రాన్స్‌పోర్టు’ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు.  
  • జేసీ సోదరుల అరాచకాలతో విసిగిపోయిన టీడీపీ సీనియర్‌ నాయకుడు హీరాపురం ఫయాజ్‌బాషా 2018 నుంచి స్తబ్దుగా ఉండిపోయారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫయాజ్‌బాషాకు చెందిన స్థలం మున్సిపాలిటీదని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అయితే ఫయాజ్‌బాషా కోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది.  
  • నడిబొడ్డున బార్‌.. ధర్నా చేసిన వారిపై దాడులు 
  • పట్టణ నడిబొడ్డున జేసీ బ్రదర్స్‌ ఆధ్వర్యంలోనే హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నడుస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు.. ప్రజల నివాసాలకు 500 మీటర్ల సమీపంలో మద్యం షాపులు ఉండకూడదు. కానీ జేసీ బ్రదర్స్‌ పట్టణ నడిబొడ్డున మద్యం వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఆ మద్యం షాపును తొలగించాలంటూ వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నా చేయగా.. జేసీ సోదరులు తమ అనుచరులతో దాడులు చేయించారు.   
  • జేసీ అరాచకాలు లెక్కకు మించి.. 
  • పెద్దవడుగూరు మండలం అప్పెచెర్లకు చెందిన సింగ్‌ల్‌విండో అధ్యక్షుడు చిట్టెం విజయభాస్కర్‌రెడ్డిని 2015 మార్చి 31న క్రిష్టిపాడులోని సింగిల్‌విండో కార్యాలయంలోనే జేసీ అనుచురులు అంతమొందించారు. 
  • ఈ కేసులో రాజీకి రావాలని జేసీ సోదరులు విజయభాస్కర్‌రెడ్డి బంధువులను, కుటుంబీలను కోరారు. అయినా వారు నిరాకరించడంతో 2018లో ఏప్రిల్‌లో వారి ఆస్తులను, వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశారు. 
  • తమ ఎదుగుదలకు అడ్డొస్తున్నాడనీ, తాము డిమాండ్‌ చేసినా డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో చిన్నపొలమడలోని ప్రభోదాశ్రమంపై కక్ష పెంచుకున్న జేసీ సోదరులు.. వినాయక నిమజ్జనం ముసుగులో 2018 సెప్టెంబర్‌ 15న చిన్నపొలమడలోని ఆశ్రమంపై దాడి చేయించారు. ఆ మరుసటి రోజు ఎంపీ జేసీ స్వయంగా వందలాది మంది అనుచరులతో ఆశ్రమం వద్దకు వెళ్లి దాడికి తెగబడ్డారు. ఈ ఘటన కేవలం అప్పటి సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డిల పర్యవేక్షణ లోపంతోనే జరిగిందని నిర్ధారించిన పోలీసు ఉన్నతాధికారులు వారిద్దరినీ సస్పెండ్‌ చేశారు.  
  • 2018 సెప్టెంబర్‌ 16 ఎంపీ జేసీ తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేష్‌ను ముట్టడించారు. ప్రభోదానందస్వామిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేయడమే కాకుండా ‘‘చేతకాని పోలీసులు’’ అని విమర్శించారు. అంతటితో ఆగకుండా పోలీసులను కొజ్జాలుగా అభివర్ణిస్తూ పోలీస్‌స్టేషన్‌ గేటుకు తాళాలు వేసి సుమారు 48 గంటలపాటు స్టేషన్‌లోనే బైఠాయించారు.  
  • 2018 ఫిబ్రవరి 27న వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషాపై ఎమ్మెల్యే జేసీ అనుచరులు దాడికి యత్నించగా... దాడి నుంచి గయాజ్‌బాషా చాకచక్యంగా తప్పించుకున్నారు. దీంతో జేసీ అనుచరులు ఆయన బీడీ ఫ్యాక్టరీపై దాడి చేసి సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు.  
  • 2015లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏడీగా పనిచేసిన ప్రతాప్‌రెడ్డి గ్రానైట్‌ అక్రమ రవాణా, జీరో వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. ఏడాదికి రూ.1.5 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రూ.7 కోట్ల వరకూ తీసుకెళ్లారు. దీంతో ప్రతాప్‌రెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేందుకు జేసీ సోదరులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. చివరకు చంపేస్తామని బెదరించారు. ఈ క్రమంలోనే ఏడీ ప్రతాప్‌రెడ్డి.. తనకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డితో ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జేసీ సోదరులు తమ అధికారం ఉపయోగించి ఆయన్ను తాడిపత్రి నుంచి బదిలీ చేయించారు.  
  • 2014 సెప్టెంబర్‌ 12న మహిళా బ్యాంకు మేనేజర్‌ ఎల్‌.మంజుల పట్ల ఎమ్మెల్యే జేసీ  దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏటీఎం కేంద్రాని తాళం వేశాడు. దీంతో ఆమె ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తప్పుడు కేసుగా కొట్టిపారేశారు. దీంతో ఆమె ప్రైవేటు కేసు వేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  
  • 2018 డిసెంబర్‌ 30న ఎమ్మెల్యే జేసీ ప్రధాన అనుచరుడు మట్కాడాన్‌ రషీద్‌.. సోదాల కోసం వచ్చిన కడప సీఐ హమీద్‌ ఖాన్‌పై దాడి చేశాడు. పోలీసు వాహనాన్ని తగులబెట్టాడు. ఈ ఘటనలో పోలీసులు కొందరిని అదుపులోనికి తీసుకోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే జేసీ... స్థానిక పోలీసు స్టేషన్‌ సర్కిల్‌లో తన అనుచురులతో కలసి బైఠాయించారు. మట్కా నిర్వాహకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

నగరంలోనూ దందా 
అనంతపురం న్యూ సిటీ : నగరంలోని నందినీ హోటల్‌ ఎదురుగా జేసీ ట్రావెల్స్‌ నిర్వహిస్తున్న స్థలం మల్లికార్జనాచారిది. 2000లో అతను ఆ స్థలాన్ని బాబాయ్య అనే వ్యక్తికి ఇచ్చాడు. అయితే బాబయ్య స్థల యజమానికే తెలియకుండా జేసీ బ్రదర్స్‌కు అద్దెకు ఇచ్చాడు. దీంతో జేసీ బ్రదర్స్‌ నెలకు రూ.2 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ 19 ఏళ్లుగా జేసీ ట్రావెన్స్‌ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఏ ఆధారం లేని తన ఇద్దరు కుమారులకు బిజినెస్‌ ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేందుకు షాపు ఖాళీ చేయమని మల్లికార్జునాచారి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని కోరగా.. ఆయన ఖాళీ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. దీంతో బాధితుడు 2018 నవంబర్‌ 8న అప్పటి డీఎస్పీ వెంకట్రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది జనవరి 18న జేసీ ట్రావెల్స్‌ ఎదుట కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులతో కలసి ధర్నా చేశారు. బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు మల్లికార్జునాచారి కుటుంబీకులు వారికి మద్దతు తెలిపిన సీపీఐ నాయకులనే అదుపులోకి తీసుకున్నారు. కానీ జేసీ బ్రదర్స్‌లో ఎటువంటి మార్పు రాలేదు. తాడిపత్రి తరహాలో నగరంలోనూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement