గోరంతను కొండంత చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్‌పై కక్ష సాధింపునకు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనను వ్యక్తిగతంగా మాధవ్ దూషించారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్, హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఎక్కడా మాధవ్ తప్పు చేయలేదని తేలడంతో సోమవారం తాడిపత్రి కోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసు నమోదు చేయాలని రిట్ దాఖలు చేశారు. దీంతో జేసీ, పోలీసుల మధ్య సమసిపోయిందనుకున్న వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభోదానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్‌ను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పరుష వ్యాఖ్యలతో దూషించారు. మొత్తం పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా పోలీసులను ‘కొజ్జాలు’గా అభివర్ణించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో పాటు ఉద్యోగ వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ జేసీపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ ఘటన తర్వాత పోలీసు సంఘం తరఫున అప్పటి పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్, కార్యదర్శి మాధవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తున్నారని, ఇటీవల పలు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కించపరిచేలా మాట్లాడుతున్నారని, చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించామని చెప్పారు. ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ‘నాలుక కోస్తాం’ అని మాధవ్ అన్నారు. ఎక్కడా కూడా జేసీ దివాకర్‌రెడ్డి పేరు ఉచ్ఛరించి విమర్శలు చేయలేదు. పైగా జరిగిన ఘటనపై కూడా విమర్శించలేదు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమనేలా మాట్లాడారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించారని జేసీ భావించి తాడిపత్రిపోలీసుస్టేషన్‌లో మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్నట్లు మాధవ్ ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా కించపరచలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
పోలీసులపై హైకోర్టును ఆశ్రయించిన వైనం: పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయించి రిట్ దాఖలు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మాధవ్ వ్యాఖ్యలు పరిశీలించామని, ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా బెదిరించడం, కించపరచడం చేయలేదని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా న్యాయసలహా కోసం ఈ అంశాన్ని ‘డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్’కు ఎస్పీ సిఫారసు చేశారు. మొత్తం వ్యవహారంలో కూడా గోరంట్ల మాధవ్, జేసీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సొసైటీని ఉద్దేశించి జనరల్‌గా చేసిన వ్యాఖ్యలను, జేసీ తనకు ఎలా ఆపాదించుకుంటారని పోలీసుల తరఫు న్యాయవాదులు కూడా వాదించారు. దీంతో ఎంత ప్రయత్నించినా కేసు నమోదు చేయలేదనే భావనకు జేసీ వచ్చారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన తర్వాత తిరిగి కొత్త కుట్ర
ఈ వ్యవహారం జరుగుతుండగానే గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాధవ్‌ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. మాధవ్ నియామకంతో ఒక్కసారిగా టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న మాధవ్‌ను రాజకీయంగా ఆదిలోనే దెబ్బతీయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైకోర్టు పరిధిలో ఉన్న కేసును తిరిగి కింది కోర్టుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి కోర్టుకు వెళ్లి మాధవ్‌పై ప్రైవేటు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. నిజానికి పైకోర్టు పరిధిలో ఉన్న కేసులపై కింది కోర్టులను ఆశ్రయిస్తే వాటిని విచారణకు స్వీకరించరని న్యాయనిపుణులు అంటున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ విషయం జేసీకి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కోర్టును ఆశ్రయించారంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాధవ్‌ను కేసులో ఇరికించే కుట్రగా విపక్ష పార్టీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment