
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివి భజన రాజకీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులకు భజన చేయడం జేసీకి అలవాటేనంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరచేందుకే జేసీ మాట్లాడతారని చెప్పారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
గతంలో వైఎస్సార్ దయ వల్లే జేసీ మంత్రి అయ్యాడని, ఆయన నియోజకవర్గం తాడిపత్రిలో అరాచకాలకు అంతేలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పోటీ చేయలేని పరిస్థితిలో జేసీ ఉన్నారని అన్నారు. అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని చెప్పారు. పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు లాక్కుంటున్నారని, సభల కోసం ప్రభుత్వ సొమ్మును కోట్ల కొద్దీ ఖర్చు చేస్తున్నారని అన్నారు.
మహానాడులో టీడీపీ మ్యానిఫెస్టో గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. నాయకులను చంద్రబాబు ఏవిధంగా వాడుకుని వదిలేస్తారో.. నాగం జనార్ధన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహుల ఉదంతాలే ఉదాహరణలని చెప్పారు. ఇవన్నీ తెలియని టీడీపీ నాయకులు చంద్రబాబు ట్రాప్‌లో పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల మనసును గెల్చుకున్న వైఎస్ జగన్‌పై ఎన్ని కుట్రలు పన్నినా అవి పటాపంచలు అవుతాయని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. కాపులు సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే దాడులకు దిగడం దారుణమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment