వర్గ విభేదాలతో అనంతపురంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కొందరు నేతల ‘వ్యతిరేక రాజకీయం’తో నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత ముదురుతోంది. పార్టీ శ్రేయస్సును పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జేసీ పవన్ కొరకరాని కొయ్యలా మారడం పార్టీలో కలకలం రేపుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన జేసీ ఫ్యామిలీ 2014లో టీడీపీలోకి వలస వెళ్లింది. ఇన్నాళ్లూ తాడిపత్రి వరకే జేసీ ఫ్యామిలీ పరిమితమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీగా, సోదరుడు ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఒకే ఇంటిలో రెండు పదవులు వచ్చినట్లయింది. ఇప్పటి వరకూ ‘అనంత’ టీడీపీలో ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇచ్చిన దాఖలాల్లేవు. వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాలకు స్వస్తి చెప్పి తనయులను రంగంలోకి దించాలనే పథక రచన చేశారు. ఇందులో భాగంగానే తాడిపత్రిలో ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి, పార్లమెంట్ పరిధిలో పవన్‌రెడ్డి పర్యటనలు సాగిస్తున్నారు. ఈ పర్యటనలకు తెలుగుదేశం పార్టీ పాత నేతల మద్దతు దక్కడం లేదు.
అంతా ‘జేసీ ఫ్యామిలీ’ని వ్యతిరేకిస్తున్నారు. అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో జేసీ పవన్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని సొంత పంథాలో రాజకీయం చేస్తున్నారు. మిగిలిన తాడిపత్రి, ఉరవకొండ. తాడిపత్రిలో పవన్ సోదరుడే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ జోక్యం చేసుకోవల్సిన పనిలేకుండాపోయింది. తక్కిన ఉరవకొండలో చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ జేసీ దివాకర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పలు సందర్భాల్లో కేశవ్‌ను జేసీ సమర్థించారు. దీనికి తోడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేశవ్ అనుచరుడు ఉమామహేశ్వరనాయుడుకు టిక్కెట్టు ఇప్పించాలనిఇద్దరూ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాల సాన్నిహిత్యంతో ఉరవకొండలో పవన్ అడుగు పెట్టలేదు. తక్కిన అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటించాడు. ఇందులో గుంతకల్లు, శింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం సిట్టింగ్‌లను మార్చాలనే ప్రతిపాదనను కూడా సీఎం ముందు జేసీ పెట్టినట్లు ఆ పార్టీలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
పార్లమెంట్ పరిధిలో బలహీనపడిన టీడీపీ
జేసీ పవన్ తీరుపై సిట్టింగ్‌లు ఓ గ్రూపుగా తయారై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు, ఇతరత్రా అంశాలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ క్రమంలో పవన్ సిట్టింగ్‌ల వ్యతిరేకులతో రాజకీయం చేస్తుండటంతో రెండు వర్గాల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఇందులో ఏ వర్గానికి టిక్కెట్టు ఇచ్చినా మరో వర్గం సహకరించని పరిస్థితి. టీడీపీ ఆవిర్భావం నుంచి ‘అనంత’ పార్లమెంట్‌లో ఆ పార్టీ బలహీనంగానే ఉంది. 2014లో మాత్రమే మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. అయితే సిట్టింగ్‌ల వైఖరి, జేసీ పవన్ అనుసరిస్తున్న తీరుతో టీడీపీ తిరిగి బలహీనపడింది. ఇదే అదనుగా ఆయా నియోజకవర్గాల్లో విపక్ష పార్టీ పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ సీట్లు విపక్ష పార్టీయే గెలవచ్చని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించడం కొసమెరుపు.
నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి..
♦ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని విట్లంపల్లి, ఉలికల్లు, గూబనపల్లి, మల్లిఖార్జునపల్లి, బోరంపల్లి, గోళ్ల, బాల వెంకటాపురం, కడదరకుంట తదితర గ్రామాల్లో జేసీ పవన్ ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఎక్కడా పాల్గొనలేదు. పైగా చౌదరిని వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీపీ మల్లిఖార్జున, మునిసిపల్ మాజీ చైర్మన్ వైటీ రమేశ్, పురుషోత్తం లాంటి నేతలను పవన్ వెంటబెట్టుకుని పర్యటించారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు మారుతికి పవన్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ‘అన్నా! మీరు లేకుండా సొంతంగా నియోజకవర్గంలో తిరిగితే ఎవరు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యతిరేకత ఉంది? అనే అంశాలు తెలుస్తాయి. దాన్నిబట్టి మనం మార్పులతో ముందుకెళ్లొచ్చు. మరో రకంగా అనుకోవద్దు’ అని చెప్పినట్లు సమాచారం.
♦ అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పార్టీలోనే ఉంటూనే జేసీ కుటుంబంతో పోరు సాగిస్తున్నారు. ఇఫ్తార్ విందుతో పాటు పవన్ చేసిన ఏ కార్యక్రమానికీ చౌదరి హాజరుకాలేదు. ఇక్కడ పవన్‌కు ఎలాంటి సహకారం లేదు. కోగటం విజయభాస్కర్‌రెడ్డి కూడా దూరమవడంతో నియోజకవర్గంలో జేసీకి వర్గమంటూ కరువైంది. కేవలం ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా జయరాంనాయుడు ఒక్కడే పవన్‌కు దగ్గరవుతున్నాడు. పవన్ వైఖరితో ఇతను కూడా చాలారోజుల నుంచి దూరంగా ఉంటున్నట్లు టీడీపీలో ప్రచారం నడుస్తోంది. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి జేసీ వర్గంలో కొనసాగుతున్నా, అహుడా చైర్మన్‌గిరి దక్కకపోవడంతో టీడీపీలో జేసీ ప్రభావం ఆశించినస్థాయిలో లేదని వారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
♦ గుంతకల్లులో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పవన్‌తో ఎక్కడా వేదిక పంచుకోలేదు. ఈ నియోజకవర్గంలో కూడా గౌడ్ వ్యతిరేకవర్గీయులతో పవన్ రాజకీయం చేస్తున్నారు. పైగా మధుసూదన్ గుప్తాకు టీడీపీ టిక్కెట్టు ఇప్పించేందుకు జేసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో చేరకుండానే గుప్తా ‘అనంత’లో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్నారు.
♦ రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులకూ జేసీ పోరు తప్పలేదు. ఇక్కడ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అండతో పవన్ సొంతంగా ఓ వర్గాన్ని పోగు చేసే యత్నం చేస్తున్నారు. దీపక్‌రెడ్డి కూడా ప్రభుత్వాన్ని, మంత్రి పనితీరుపై ఇటీవల పలు వేదికల్లో విమర్శలు గుప్పించారు.
♦ శింగనమల నియోజకవర్గంలో పవన్‌ను శమంతకమణి, యామినీబాల కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ తనకంటూ ఓ వర్గం ఉండాలని వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment