![JD Laxminarayana Quits Janasena Party - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/30/janasana.jpg.webp?itok=qeEgcJdA)
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడంపై నిరసనగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ తీరు, పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న లక్ష్మీనారాయణ... గురువారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు.
‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను.
ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికి మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని జేడీ లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే పవన్, లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. కాగా, ఇటీవల బీజేపీతో జనసేన పొత్తు సహా పలు కీలక అంశాలపై పార్టీ తనను సంప్రదించకపోవడంపై లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment