ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్ సీఎం నితీష్ కుమార్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటుపై నిర్థిష్ట ఒప్పందం జరగాలని జేడీ(యూ) కోరుతోంది. సరైన తరుణంలో ఈ దిశగా బీజేపీ చొరవచూపాలని, దీనిపై ఇంతవరకూ ఆ పార్టీ నుంచీ ఎలాంటి సంకేతాలు లేవని జేడీ(యూ) వర్గాలు పేర్కొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పూర్తి భిన్నమైనవని గుర్తెరగాలని జేడీ(యూ) తేల్చిచెప్పింది.
ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు కూలంకషంగా చర్చించిన మీదట సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావడం మేలని సూచించింది. క్షేత్రస్ధాయిలో ప్రస్తుత పరిణామాలను అంచనా వేసి సరైన ఎత్తుగడతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సీనియర్ జేడీ(యూ) నేత పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రాతిపదికన సీట్ల పంపకం ఉండాలన్న బీజేపీ ప్రతిపాదనను జేడీ(యూ) శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి నిదర్శనంగా భావించాలని స్పష్టం చేశాయి. బిహార్‌కు ప్రత్యేక హోదా వర్తింపచేయకపోవడం రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు 2020లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ కూటమికి ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment