న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీతో పాటు మహిళ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ మాత్రం ఆజాంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆజంఖాన్‌ను సమర్ధించేలా ఆయన పలు ఊదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. అన్నాచెల్లెలు, తల్లికొడుకులు ముద్దు పెట్టుకున్నా అది లైంగిక సంబంధమేనా అని ప్రశ్నించారు. 2015లో జేడీయూను వీడిన జితన్‌రామ్ స్వంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని స్థాపించారు.
కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రమాదేవి కూడా ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు మహిళా ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే, మిమి చక్రవర్తి, అనుప్రియా పటేల్‌లు ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మాత్రం ఆజంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమేనని ఆజంఖాన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment