
దుష్యంత్ చౌతాలా, సతీశ్ చంద్ర మిశ్రా
న్యూఢిల్లీ: హరియాణాలో మరో పొత్తు విరిసింది. త్వరలో అక్కడి అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రకటించాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న 90 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 50 స్థానాలు, జేజేపీ 40 స్థానాల్లో పోటీ పడనున్నాయి. ఆదివారం విలేకరుల సమావేశంలో జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రాతో కలిసి పొత్తును ప్రకటించారు. ఇరు పార్టీల అగ్ర నాయకులు పలుమార్లు చర్చించిన తర్వాత పొత్తు నిర్ణయం జరిగిందని దుష్యంత్ తెలిపారు. తమ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించబోతోందని సతీశ్ చంద్ర వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓంప్రకాశ్ చౌతాలాతో విభేదించి ఆయన ఇద్దరు కుమారులు అజయ్, అభయ్ బయటకు వచ్చేశారు. తన కుమారుడు దుష్యంత్‌తో కలిసి అజయ్ జేజేపీని స్థాపించారు.
మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఐఎన్‌ఎల్‌డీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు, జేజేపీ–బీఎస్పీ కూటమి సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment