![JJP Considers Dushyant Mother Naina Chautala For Deputy CM - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/26/naina.jpg.webp?itok=wYc6jWsy)
చంఢీఘడ్: హరియాణా ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ తల్లి నైనా చౌతాలా(53) పేరును పరిశీలిస్తున్నట్లు శనివారం జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎవరిని డిప్యూటీ సీఎం చేస్తారనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని అన్నారు. నైనా బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ నేత రణ్‌బీర్ సింగ్ మహేంద్రను ఓడించారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్ చౌతాలాకు భార్య నైనా చౌతాలా. దబ్వాలి నుంచి ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన నైనా.. 2018లో కుమారుడు దుష్యంత్ చౌతాలా(31) స్థాపించిన జన్నాయక్ జనతా పార్టీలో చేరారు.
హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 స్థానాలు దక్కించుకోవాలి. కానీ హరియాణాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. అత్యధికంగా 40 సీట్లు గెలిచిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శుక్రవారం జేజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా బీజేపీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో 10 సీట్లు గెలిచిన జేజేపీకి డిప్యూటీ సిఎం పదవి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొంది. హరియాణాలో స్థిరమైన ప్రభుత్వం కోసం బీజేపీ-జేజేపీ కూటమి అవసరమని భావించడంతో పొత్తుకు అంగీకరించామని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ మనవడైన దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దుష్యంత్ నేడు చండీగఢ్‌లో గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను సమర్పించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment