యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్‌ | Job calendar on the basis of UPSC | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్‌

Published Wed, Sep 26 2018 2:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Job calendar on the basis of UPSC - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రాజనర్సింహ

సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి వస్తే ఏటా యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, పకడ్బందీగా ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపడతామని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించి, దాని ఆధారంగానే నోటిఫికేçషన్లు ఇస్తామని, నిర్ణీత కాలపరిమితితో ఉద్యోగ నియమాకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో రాజనర్సింహతో పాటు మేనిఫెస్టో కమిటీ సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఇందిరా శోభన్‌లు వివిధ విద్యార్థి, కుల, ఉద్యోగ, సంఘాల నేతల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు వందకు పైగా సంఘాలు తమ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ కమిటీకి వినతి పత్రాలు ఇచ్చాయి.

నిరుద్యోగ సంఘాలు, టీఆర్టీకి అర్హత సాధించిన అభ్యర్థులు వందల సంఖ్య లో దామోదరతో భేటీ అయ్యారు. తమను ప్రభు త్వం ఘోరంగా మోసం చేసిందని, డీఎస్సీ ద్వారా ఒక్క టీచర్‌పోస్టును కూడా భర్తీ చేయకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ చెప్పినట్లు వంద రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ ఇప్పటికే ప్రకటించినట్లు కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ నియమాకాల విషయంలో దారుణంగా నిరుద్యోగలను మోసం చేసిందని, ఓ పక్క నోటిఫికేషన్‌లు ఇచ్చి, మరోపక్క కోర్టుల్లో కేసులు వేయించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిందని దుయ్యబట్టారు. ప్రజలు, నిరుద్యోగులను మోసం చేసే వైఖరి కాంగ్రెస్‌కు లేదని, ఆరునూరైనా మెగా డీఎస్సీనే తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. తొలి ఏడాదిలోనే మరో లక్ష ఉద్యోగాల భర్తీ కోసం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. 

పలు సంఘాల వినతులు 
రేషన్‌ డీలర్లు తమ కమీషన్‌ పెంచడంతో పాటు గౌరవవేతనాలు ఇవ్వాలని, వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని, తమను రెగ్యులరైజ్‌ చేయాలని హెచ్‌ఎండీఏ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించాలని ప్రైవేటు టీచర్లు, ఔట్‌సోర్సింగ్‌లో çపనికి తగిన వేతనం ఇవ్వాలని సాక్షర భారత్, సెర్ప్‌ ఉద్యోగులు, ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించి గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రత్యేక ఫైనాన్స్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మాదిగ విద్యావంతుల వేదిక, ఓసీ జనజాగృతి సంస్థలు తదితరులు వినతిపత్రాలు అందజేశారు. కస్తూర్బా ఉద్యోగులు, జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, స్పైనల్‌కార్డ్‌ ఇంజురీస్‌ అసోసియేషన్, కిడ్నీ రోగుల సంక్షేమ సంఘం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల జేఏసీ, బంజారా సమితి, ఫార్మాసిటీ సంఘాలు, హోంగార్డులు, హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, దివ్యాంగులు, బోడ బుడగ జంగాల నేతలు కలసి తమ సమస్యలను పరిష్కరించేలా మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పక్షాన భరోసా కల్పించాలని కోరాయి.  

ప్రైవేటు వర్సిటీ బిల్లు రద్దు? 
ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేసే ఆలోచన చేస్తున్నామని, దీనిపై మేనిఫెస్టో కమిటీ విస్తృతంగా చర్చిస్తోందని దామోదర రాజనర్సింహ చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మేనిఫెస్టో కమిటీకి 200కుపైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఒక్కొక్కరి సమస్యలు వింటుంటే చాలా బాధగా ఉందని, టీఆర్‌ఎస్‌ను ప్రజలు నెత్తికెక్కించుకుని ఓట్లేస్తే ఇంత అన్యాయం చేసిందా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వీరికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ కల్పన ప్రయత్నాలు చేస్తామని, ఇంకా అనేక సంస్థలు, వ్యవస్థలను అధ్యయనం చేయాల్సి ఉందని, ఆయా ప్రాంతాల సమస్యలను బట్టి ప్రత్యేక దృష్టితో పరిశీలించి మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు మేనిఫెస్టో కమిటీ నాలుగైదు జిల్లాల్లో పర్యటిస్తుందని చెప్పారు. 2017 భూసేకరణ బిల్లును పునఃపరిశీలిస్తామని, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలన్న విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అహం పెరిగి, కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, గత చరిత్ర చూసుకుని కేటీఆర్‌ మాట్లాడాలని హితవు పలికారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement