
సాక్షి, విజయవాడ : కేంద్ర బడ్జెట్‌పై ఇప్పటివరకూ స్పందించని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు మూగబోయిందా..? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్రం అగ్గి మీద గుగ్గిలం అవుతోందని అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆవేదనను కేంద్ర పాలకులు పెడచెవిన పెట్టారని విచారం వ్యక్తం చేశారు. ఏం సాధించారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ర్యాలీ నిర్వహించారని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకు బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని కోట్లాది మంది ఆంధ్రులు అడుగుతున్నారు. మీరెందుకు భయపడుతున్నారు చంద్రబాబూ. మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. 12 రోజులుగా ఎక్కడ దాక్కున్నావు. మోదీ అంటే ఎందుకు బాబుకు భయమని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
చంద్రబాబు నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అంటున్నారు. ఏం సాధించకుండా ఉత్సవాలేంటని ప్రజలు విస్తుపోతున్నారు. చంద్రబాబు ఆంధ్రుల అభిమానాన్ని ప్రధానమంత్రి మోదీ వద్ద తాకట్టుపెట్టారు. చంద్రబాబు కంటే దుర్యోధనుడే బెటర్ అని ప్రజలు చెబుతున్నారు. బీజేపీ - టీడీపీలు ఏపీ ప్రజలకు గుండు గీశాయి. రెండు కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను నట్టేట ముంచాయి.’
Comments
Please login to add a commentAdd a comment