భోపాల్: ‘‘కమల్‌నాథ్ లేదా దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 నెలల్లో వారు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. వారి స్వప్రయోజనాల కోసమే వారు పనిచేశారు. ఒకసారి గతంలో వారు చేసిన వాగ్దానాలు, వాటిని విస్మరించిన చరిత్రను పరిశీలించుకోవాలి. అయితే నేను వాళ్లకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ‘టైగర్ అభీ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది)’’ అంటూ బీజేపీ ఎంపీ జోత్యిరాదిత్య సింధియా కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ ప్రభుత్వంలో అర్హుడైన ప్రతీ పౌరుడికి అన్ని విధాలా లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు గురువారం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో కొత్తగా 28 మందికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించింది. వీరిలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేబినెట్ కేవలం నాయకుల బృందం మాత్రమే కాదు. ఇది ప్రజల కోసం పనిచేసే టీం. వాళ్లు మంత్రులు కాదు.. ప్రజాసేవకులు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందుతాయి. 100 రోజుల పాలనలో శివరాజ్ సింగ్ ప్రభుత్వం కరోనాతో సమర్థవంతంగా పోరాడింది. సాధ్యమైనంత వరకు రైతులకు అండగా నిలబడింది. వచ్చే నాలుగేళ్లలో మరింత సమర్థవంతంగా పాలన కొనసాగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!)
ఇక సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడంతో కమల్‌నాథ్ సర్కారు కుప్పకూలగా.. బలం నిరూపించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సింధియా ఎంపీగా ఎన్నికకాగా.. ఆయన మద్దతుదారులు ఈరోజు మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం. కాగా సింధియా కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment