
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న మహబూబ్‌నగర్ లో జరిగే భారీ బహిరంగ సభతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘జాతీయ కార్యవర్గ సమావేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి ప్రధానంగా చర్చించాం’ అని అన్నారు.
ఇందులో ఊహించని రీతిలో ఎన్నికలకు వెళ్లనున్న తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఎన్నికల వరకు ఆయన సుమారు 50 సభల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్టు దక్కని చాలా మంది నేతలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు.