విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రారంభంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రివిలైజ్ కమిటీ చైర్మన్‌గా చర్యలు తీసుకుంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన సముదాయాన్ని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదరనాయుడు ఎలా ప్రారంభించేందుకు ప్రయత్నించారో అధికారులు వివరణ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్న విషయాన్ని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వీసీ తన ఇష్టానుసారంగా భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించడం ముమ్మాటికి ప్రొటోకాల్ ఉల్లంఘనేనన్నారు. ప్రొటోకాల్‌పై కొత్త జీఓను అధికారులకు చదివి వినిపించి వీసీకు ప్రొటోకాల్ ఉందాని ప్రశ్నించారు. ప్రివిలైజ్ కమిటీ చైర్మన్‌గా సంబంధిత శాఖ అధికారులకు నోటీసులను జారీ చేస్తామన్నారు. భవన నిర్మాణం నాణ్యతపై విజిలెన్స్ తనిఖీలను చేయిస్తామన్నారు. భవనం అంచనా విలువల్లో 2.75 శాతం అదనంగా కాంట్రాక్టర్‌కు నిధులు మంజూరు చేశారని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.1.70కోట్లు మంజూరు చేశారని, భవనాన్ని ప్రారంభించేందుకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి తర్వాత తొలగించారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అప్పటి రాపూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి, తాను ఎంతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించామన్నారు. వైఎస్సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
సోమిరెడ్డికి కమీషన్లు దండుకోవడమే తెలుసు
పనులు మంజూరు చేయించికాంట్రాక్టర్లను పిలిపించుకుని సెటిల్‌మెంట్లు చేసి కమీషన్లు దండుకోవడమే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తెలుసునని, అభివృద్ధి అంటే అసలు తెలియదని ఎమ్మెల్యే కాకాణి దుయ్యబట్టారు. అందులో భాగంగానే పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని మంజూరు చేశారన్నారు. కండలేరు ఎడమగట్టు కాలువ లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీమ్‌కు రెండు మోటార్లు ఏర్పాటు చేస్తే అందులో ఒకటి అసెంబుల్డ్ మోటారని ఆనాడే చెప్పానని, అదే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. 28 రోజులుగా గ్రావిటీ తగ్గిన కాలువకు 130 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నది ఒక్క మోటారుతోనేనన్నారు. మోటార్ల ఏర్పాటులో సోమిరెడ్డి కమీషన్ల భాగోతానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. సమగ్ర విచారణ జరిపిస్తే అధికారులు ఇబ్బందులు పడక తప్పదన్నారు.
సోమిరెడ్డి ఎంత గింజుకున్నా ఆక్రమణల తొలగింపును అడ్డుకోలేడన్నారు. చెరువు సప్లయి ఛానల్‌ను అడ్డగించి ఇళ్లు నిర్మిస్తుండగా అధికారులు తొలగించేందుకు వెళ్లారన్నారు. ఆక్రమణల తొలగింపునకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్‌సీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కాలువ గట్టున ఉన్న ఆక్రమణలను తొలగించి తీరుతామని, దమ్ముంటే అడ్డుకోవాలన్నారు. తాను తెలిసి ఎవరికీ అన్యాయం చేయనని, ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని వెల్లడించారు. సోమిరెడ్డి తాటాకు చప్పళ్లకు »ñ బెదిరేది లేదని, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని ఐదు పర్యాయాలు ఓడిన ఘనాపాటి సోమిరెడ్డి అడ్డుకోలేడన్నారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, రావుల దశరధరామయ్యగౌడ్, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, తెనాలి నిర్మలమ్మ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment