సోమిరెడ్డివి దుర్మార్గపు రాజకీయాలు | Kakani Govardan reddy Slams Somireddy Chandramohan Reddy | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డివి దుర్మార్గపు రాజకీయాలు

Published Mon, Apr 27 2020 1:20 PM | Last Updated on Mon, Apr 27 2020 1:48 PM

Kakani Govardan reddy Slams Somireddy Chandramohan Reddy - Sakshi

నరసింహకండ్రికలో బియ్యం, వంటనూనెను అందజేస్తున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు, పొదలకూరు: కరోనా విపత్తుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా వారి సంక్షేమం కోసం తాను పాటుపడుతుంటే టీడీపీ నాయకుడు సోమిరెడ్డి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలంలోని నరసింహకండ్రిక, గురవాయపాళెం, కనుపర్తి, ఆల్తుర్తి, మొగళ్లూరు, ఆర్‌వైపాళెం గ్రామాల్లో ఆదివారం సర్వేపల్లి రైతన్న కానుక కింద బియ్యం, వంటనూనెను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కరోనాకు భయపడి తాను ఇంట్లో కూర్చుంటే పేదలను ఎవరు ఆదుకుంటారన్నారు. రూ.3.50 కోట్ల విలువ చేసే బియ్యం, నూనెలను సమీకరించడాన్ని అభినందించాల్సిపోయి తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు సైతం పేదలకు సాయం అందిస్తే అభినందిస్తానన్నారు.

నాయకుడన్న వాడు పేదలకు ఒక్కరికైనా సాయం అందించినా ఆహ్వానించాలని తన కార్యకర్తలకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదంతా పక్కన పెట్టి సోమిరెడ్డి తాను పర్యటిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని రకరకాలుగా రైతన్న కానుకను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నడం దురదృష్టకరమన్నారు. ధాన్యం సేకరించినంత మాత్రాన బియ్యం రావని, కార్యకర్తలు ఎంతో ఓర్పుతో మిల్లర్ల వద్దకు వెళ్లి ఆడించి ప్యాకింగ్‌ చేయిస్తున్నారని తెలిపారు. పేదలను ఆదుకునే కార్యక్రమానికి కూడా రాజకీయాలు ఆపాదిస్తే పుట్టగతులుండవన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యాన్ని బలవంతంగా వసూలు చేశానని ఆరోపించడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, నువ్వుల మంజుల, తహసీల్దార్‌ స్వాతి, ఎంపీడీఓ సుజాత, ఈఓపీఆర్డీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement