సాక్షి, జగిత్యాల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో తెలంగాణలో అవసరమా అని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. గురువారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోల్వాయి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని అన్నారు. అలాంటి వారు కూటమి పేరుతో ముందుకి వస్తున్నారని, వారిని ఆదరించ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు అని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. నీటికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా నిధులిచ్చే వారని తెలిపారు.
టీఆర్‌ఎస్ పార్టీ అందరికీ సమానంగా నిధులిస్తోందని చెప్పారు. రైతు బంధు పేరుతో పెట్టుబడి ఇవ్వటమే కాకుండా, సమయానికి ఎరువులు, కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. పేదవాడి కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నారు. టీఆర్‌ఎస్ పేదల అభ్యున్నతికి పాటు పడుతుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ దళితుల కోసం ప్రత్యేక పథకాల రూపకల్పన చేస్తున్నారని వెల్లడించారు. అర్హులైన బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వబోతున్నామని తెలిపారు. భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని వారందరికి నేరుగా బ్యాంక్ ద్వారా డబ్బు చెల్లింపులు జరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment