రాజకీయపార్టీ స్థాపన కోసం ప్రజల నుంచే ఫండ్ వసూలు చేస్తానని ప్రకటించిన నటుడు కమల్‌హాసన్ తాత్కాలికంగా మనసు మార్చుకున్నారు. ముందు పార్టీ, ఆ తరువాతే ఫండ్ అంటున్నారు. ఇప్పటి వరకు అభిమానుల నుంచి పొందిన రూ.30 కోట్లను వెనక్కు ఇచ్చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై : కమల్ రాజకీయ ప్రవేశం ఖాయమైపోగా పార్టీ పేరు, జెండా, అంజెండాలకు రూపకల్పన జరుగుతోంది. తెరవెనుక సన్నాహాలు చేసుకుంటూనే వచ్చేనెల నుంచి ప్రజల ముందుకు వచ్చేందుకు కమల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీని స్థాపించడం అంటే మాటలు కాదు, ఒక సినిమా తీయడానికే కనీసం ఏడాది పడుతున్న పరిస్థితిలో రాజకీయాల్లోకి ఆచీతూచీ అడుగువేయాల్సి ఉందని కమల్ తన జన్మదినం రోజున చెప్పారు. ఆర్థికబలం లేకుండా, అవినీతికి తావులేకుండా పార్టీని నడపడం ఎలా సాధ్యమని గతంలో కమల్‌ను మీడియా ప్రశ్నించినపుడు ‘ ప్రజల నుంచి పార్టీ ఫండ్‌ను సేకరిస్తాను’ అని చెప్పారు. కమల్ చేసిన ఈ ప్రకటనతో తీవ్రంగా స్పందించిన ఆయన అభిమాన, సంక్షేమ సంఘాలు సుమారు రూ.30 కోట్లను సిద్ధం చేయడంతోపాటు ఆయన ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది.
విరాళాలు వెనక్కి..
అయితే ఈ సొమ్మును స్వీకరించేందుకు కమల్ ఇష్టపడలేదు. తన వద్దకు చేరిన సొమ్మును ఎవరు చెల్లించారో తెలుసుకుని వారికే తిరిగి అప్పగించాలని నిర్ణయించకున్నట్లు కమల్ శుక్రవారం తెలిపారు. తాను నటుడైన తరువాత గత 37 ఏళ్లకాలంలో అభిమానులు కోట్లాది రూపాయలను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుచేశారని తెలిపారు. పార్టీకి అవసరమైన ఆర్థికసహాయాన్ని ప్రజలే అందిస్తారని తాను ప్రకటిస్తే అభిమానులు అందజేస్తారని మీడియాలో వచ్చిందని ఆయన అన్నారు. ఇది తానే ఇచ్చిన పిలుపుగా భావించిన అభిమానులు భారీ ఎత్తున నిధులు సేకరించి తనకు పంపినట్లు చెప్పారు. ఇలాంటి అయోమయ పరిస్థితులను చక్కదిద్దేందుకు తాను సిద్ధమయ్యానని, అభిమానుల నుంచి వచ్చిన సొమ్మును వారికే వెనక్కి ఇచ్చేయాలని తన సిబ్బందిని ఇప్పటికే ఆదేశించా, అందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఉత్తరాలు, డబ్బు రావడం ప్రారంభమైంది, అయితే ముందుగానే నిధులు స్వీకరించడం చట్టవిరుద్ధం అవుతుందని నాకు తెలుసు, ఇలాంటి అపవాదులకు తావివ్వనని అన్నారు.
అయితే ప్రస్తుతం తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిధులు స్వీకరించనని అర్థంకాదు, పార్టీనే లేనపుడు డబ్బును ముట్టుకోకూడదని చెప్పారు. ప్రస్తుతం వెనక్కు చేస్తున్న సొమ్ము నాదేనని భావించి భద్రం చేయండి, తాను తిరిగి కోరేలోగా ఖర్చయితే ప్రాప్తం లేదని సరిపెట్టుకుంటాను అన్నారు. అభిమానులు నిధులు పంపిన రోజునే పార్టీ ఆవిర్భవించినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం ఒక వ్యక్తిగా తాను సమకూర్చుకోలేను, అందుకే ప్రజలను కోరానని చెప్పారు. రాజకీయ నాయకునిగా తన లక్ష్యం గురించి త్వరలో అభిమానుల సమక్షంలో ప్రకటిస్తాను, ఈలోపు రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment