సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కమల్
తిరువళ్లూరు: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు. సినీనటుడు కమల్‌హసన్ రాజకీయ పార్టీనీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజల్లో తిరుగుతూ సేవాకార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా దినోత్సవం రోజున (మార్చి 8) జరిగిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని అధిగత్తూరు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అనంతరం తన టీమ్‌ను అధిగత్తూరులో పర్యటింప చేసి వాస్తవ పరిస్తితులను అడిగి తెలుసుకోవడంతో పాటు మే 1న గ్రామంలో పర్యటించి పలు హమీలు ఇచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి కోసం ప్రత్యేక ప్రాజెక్టులు పక్కా గృహాలు ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. అయితే కమల్ పర్యటన ముగిసిన రెండు నెలల తరువాత సేవా కార్యక్రమాలను వేగవంతం చేశారు.
యువతిని దత్తత తీసుకున్న కమల్: తాజాగా కమల్ కార్యచరణలో వేగం పెంచారు. అధిగత్తూరు గ్రామానికి చెందిన దినసరి కూలీ ముత్తు. ఇతని భార్య లక్ష్మి. వీరికి సునీత అనే కుమార్తె వుంది. ముత్తు 2010లో మరణించాడు. లక్ష్మి కూలీ పనులను చేసుకుంటూ కుమార్తె సునీతను చదివిస్తోంది. పదో తరగతి పరీక్షల్లో 370 మార్కులు సాధించిన సునిత, ప్లస్‌టూలోనూ 652 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే పైచదువులు చదివించే స్తోమత లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పంచాయతీ మాజీ అధ్యక్షుడు చిదంబరనాథన్ కమల్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని చెన్నైకు పిలిపించుకున్న కమల్ వారి ఆర్థిక స్థితిగతులను ఆరా తీశారు.
సునీత చెప్పిన మాటల్లో ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన కమల్ యువతిని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. మూడేళ్లు ఉచితంగా చదివిస్తానని ఆపై పోషణ బాధ్యత తీసుకుంటానని ప్రకటించి వెంటనే తిరునిండ్రవూర్‌లోని ప్రైవేటు కళాశాల్లో డిగ్రీలో చేర్పించారు. ఆదే విధంగా అధిగత్తూరు కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న మాలశ్రీ, డేవిడ్ ప్రియా తదితరులకు ఐదు లక్షల వ్యయంతో అరుదైన ఆపరేషన్ చేయించారు. మొత్తానికి కమల్ దత్తత తీసుకున్న గ్రామంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. గ్రామంలో 130 ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం సైతం సోమవారం ఉదయం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment