కమల్‌హాసన్
సాక్షి, చెన్నై : కుల రాజకీయాల కంటే మనం అలవాటు పడిన రాజకీయాలు, అత్యంత భయంకరమైనవి, ప్రమాదకరమైనవని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కమల్ తమ పార్టీ విధి విధానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ప్రమాద కరంగా మారిపోయందన్నారు. ఓటరు నోటు తీసుకొని వేయడం ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకుడికి అమ్మడమేనని అన్నారు.
ఖద్దరు వేసిన వాడే రాజకీయ నాయకుడు అనే భ్రమలో ప్రజలు ఉన్నారని వారిని చైతన్య వంతులని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుత పార్టీలు, నాయకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నని విస్మరిస్తున్నారని, రైతు ఎలా పోతే నాకేంటి, నాకు ముద్ద దొరికితే చాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. మూడు పూటలా కడుపు నిండా తింటున్న నేతలకు తిండి ఎక్కడ నుంచి వస్తుందో తెలియకపోవడం మన దురదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమాజం మురికి కూపంలా మారిపోయిందని, ఆ వాసనకు అలవాటు పడి అదే గొప్ప అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందన్నారు. అందరు కలిసి రాజకీయాలను, సమాజాన్ని శుభ్రం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కుళ్లిపోయిన రాజకీయాలను మార్పు తెచ్చేందుకు తాను సిద్ధం అని అందరూ కలిసి ముందుకు రావాలని కోరారు. మార్పు అనేది ఏ ఒక్కరితోనే రాదని, అందరు కలిసి ముందుకు సాగితేనే సాధ్యం అని కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment