బాబు మోసకారి | Kangati Sridevi Slams Chandrababu naidu Kurnool | Sakshi
Sakshi News home page

బాబు మోసకారి

Published Sat, Jan 26 2019 2:03 PM | Last Updated on Sat, Jan 26 2019 2:03 PM

Kangati Sridevi Slams Chandrababu naidu Kurnool - Sakshi

రామకృష్ణాపురంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న కంగాటి శ్రీదేవి

కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారి అని..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు సక్రమంగా నెరవేర్చలేదని
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. సీఎం కుర్చీ కోసం    పిల్లనిచ్చిన మామ ఎన్టీరామారావును  వెన్నుపోటు పొడిచిన  బాబు.. అధికారం కోసం ఇప్పుడు ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రలోభాలకు  తెరతీశారని..ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం, కర్నూలు, పత్తికొండ  నియోజకవర్గాల్లో ‘నిన్ను నమ్మం బాబూ’ కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన  పార్టీ  నియోజకవర్గ ఇన్‌చార్జీలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.   
పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని 27వ వార్డులో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్ర రాజకీయాలు, నయవంచనకు మారు పేరే చంద్రబాబు నాయుడని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి పాలన సాగిస్తున్నారని.. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించుకుని రాజన్న రాజ్యం తెచ్చుకుందామని  ప్రజలకు పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతరెడ్డి, రమణారెడ్డి, లక్ష్మికాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

బనగానపల్లె నియోజకవర్గం  కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి, హనుమంతు గుండం గ్రామాల్లో  నిర్వహించిన ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి పాల్గొన్నారు. వీరు  గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ నవరత్నాల ప్రయోజనాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూటకోమాటతో ముఖ్యమంత్రి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.   వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతుంటే టీడీపీ సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.

కోడుమూరు నియోజకవర్గం  సి.బెళగళ్‌ మండలం పోలకల్లు గ్రామంలో పార్టీ ఇన్‌చార్జ్‌ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో  ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనకు  రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ విషయం తెలిసే  చంద్రబాబు తమ పార్టీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొడుతున్నారన్నారు.  బాబు ఎన్ని నాటకాలాడిన ప్రజలు  గమనించి  ఓటుతో తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ సెక్రటరీ విక్రమ్‌కుమార్, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు నగరంలోని శ్రీరామ్‌నగర్‌లో  ‘నిన్ను నమ్మంబాబు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా  పార్టీ ఇన్‌చార్జ్‌ హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ మైనార్టీల పట్ల  టీడీపీ కపట ప్రేమ చూపుతోందన్నారు.  నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు బయటకు వచ్చినట్టు డ్రామాలాడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  ఆ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.    పార్టీ నాయకులు తెర్నేకలు సురేంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కటారి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

పత్తికొండ  నియోజకవర్గం కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో నిర్వహించిన ‘నిన్ను నమ్మంబాబు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా    పార్టీ ఇన్‌చార్జ్‌ కంగాటి శ్రీదేవి  మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూరగొనలేని టీడీపీ నాయకులు గ్రామాల్లో ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించి అశాంతి  రేపుతున్నారన్నారు. మహిళలకు,   మహిళాధికారులకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నందున మరిన్ని హామీలు గుప్పిస్తున్నారన్నారు.  బూటకపు హామీలు నమ్మేస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో నాయకులు ప్రదీప్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి తదితరులు
పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement