కాకినాడ: బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషణలకు దిగడం ఆ పార్టీ నేతల నైజాన్ని బయటపెడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. జెడ్పీ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. గురువారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పట్ల రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరించిన తీరు అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఎమ్మెల్యే పట్ల అత్యంత దూకుడుగా వ్యవహరించి నీళ్ల బాటిళ్లతో విసిరికొట్టడం చూస్తుంటే జిల్లాలో టీడీపీ నేతల్లో నెలకొన్న అసహనానికి అద్దం పడుతుందన్నారు. తాము ఎన్ని తప్పులు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. ఇంతకాలం తమ అవినీతికి అడ్డువచ్చే అధికారులపై దాడులకు దిగిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కూడా దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీ నేతల తీరు మారకపోతే తాము కూడా తగిన రీతిలో స్పందించాల్సి ఉంటుందని కన్నబాబు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment