చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు | Kanna has Written A Open Letter To AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు

Published Wed, Oct 24 2018 11:21 AM | Last Updated on Wed, Oct 24 2018 12:21 PM

Kanna has Written A Open Letter To AP CM Chandrababu Naidu - Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 17వ సారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి లేఖాస్త్రం సంధించారు. ఈ దఫా మరో ఐదు ప్రశ్నలు వేశారు. దీంతో ఇప్పటి దాకా కన్నా పంపిన ప్రశ్నల సంఖ్యకు 85కి చేరింది. కానీ ఇప్పటి వరకు కన్నా లక్ష్మీనారాయణ పంపిన ప్రశ్నలకు  చంద్రబాబు నాయుడి నుంచి ఎటువంటి స్పందన లేదు.


ప్రశ్న నెంబర్‌ 81: మీరు, మీ కుమారుడు, మీ అనుచరులు, మీ చెంచా మీడియా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా ఐటీ దాడులు చేయిస్తుందని గగ్గోలు పెట్టారు. మీ బినామీ రమేష్‌ మీసాలు కూడా తిప్పుతున్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎడ్కో(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు సీఎం రమేష్‌ రిత్విక్‌ సంస్థ రూ.12 కోట్లు చెల్లిస్తే, ఆ అడ్రస్‌లో ఆ కంపెనీనే లేదు. ఆ సంస్థ ప్రతినిధి సాయిబాబా రిత్విక్‌ కంపెనీ అకౌంటంట్‌ కాదని మీరందరూ ప్రకటించగలరా? సూట్‌ కేసు కంపెనీలకు చెల్లించిన డబ్బు విచారణ చేయించుకోగలరా? ఈ కోట్లాది రూపాయలేగా ఎంఎల్‌ఏలను కొనటానికి ఉపయోగించింది. తెలంగాణాలో రేవంత్‌ రెడ్డి చేత పంపిన యాభై లక్షలు కూడా అవే గదా. ఏపీని నిలువునా దోచి, వేల కోట్ల కాంట్రాక్టులను మీ బినామీ అయిన రమేష్‌ కంపెనీలకు ఇష్టారాజ్యంగా ఇచ్చి అక్కడ నుంచి మీరు వెనక్కు తెచ్చుకోవడం. ఏమి నైపుణ్యం. ఇలాంటి అనాగరిక సంస్కారహీనుడైన వ్యక్తి రాజ్యసభకా? ఆయనకున్న అర్హత మీ బినామీ కావడమే. అలా పంపినందుకు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత అతని చేత రాజీనామా ఇప్పించండి. ఈ విషయమై సీబీఐ విచారణకు స్వచ్ఛందంగా అడగగలరా?

ప్రశ్న నెంబర్‌ 82: నీరు-చెట్టు పథకంలో భాగంగా సెక్రటేరియట్‌ దగ్గర నాటిన మొక్కలకు సంబంధించి చేసిన కోట్లాది రూపాయల అవినీతిని ఇంకా ప్రజల మరచిపోక ముందే కుప్పం నియోజకవర్గంలో పంచిపెట్టేందుకు ఒక్కో క్రికెట్‌ బ్యాట్‌ను రూ.6 వేలకు కొని, ప్రతీ డిపార్టుమెంటులో అవినీతి ఉండాల్సిందేనని నిరూపించారు. జీఓ ఆర్టీ నెంబర్‌.413, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌, టూరిజం, కల్చర్‌(స్పోర్ట్ట్స్‌ అండ్‌ యూత్‌ సర్వీస్‌) శాఖ, 16-10-2018 తేదీన 250 క్రికెట్‌ బ్యాట్‌లను మెస్సర్‌ ఎక్సెల్‌ స్పోర్ట్ట్స్‌ వారి నుంచి రూ.15 లక్షలకు కొన్ని మాట అబద్ధమా? మీ నియోజకవర్గంలో పంచే క్రికెట్‌ బ్యాట్లలో కూడా అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా?

ప్రశ్న నెంబర్‌ 83: అస్తమానం మీరు, మీ అనుచరులు కేంద్రం నుంచి ఎలాంటి సాయం సహకారం లేదని గగ్గోలు పెడుతూ ఉంటారు. సాక్షాత్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌ కుమారే దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా నిధులు వచ్చాయని చెబుతున్నారు కదా? అందువల్ల 1776 గ్రామపంచాయతీ భవనాలను, 4843 అంగన్‌వాడీ భవనాలకు, 15వేల కి.మీల సీసీ రోడ్లను, 2.46 లక్షల పంట కుంటలను నిర్మించుకున్నామని చీఫ్‌ సెక్రటరీ చెప్పలేదా? ముఖ్యమంత్రిగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా?

ప్రశ్న నెంబర్‌ 84: రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు మీకూ, మీ కుమారునికీ, మీ మంత్రులకూ అనుచరులకూ, కలెక్షన్లకూ కేంద్రమైంది. ప్రాజెక్టులన్నీ మీ బినామీలకు అప్పగించడం, అంచనాలు పెంచడం, నిధులన్నీ దోచిపెట్టడం, ఆ నిధులన్నీ మరలా మీ దగ్గరకు రావడం. కృష్ణా నదిపై వైకుంఠాపురం బ్యారేజ్‌ నిర్మాణం అంచనాలను రెండుసార్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో. రెండుసార్లు టెండర్లను ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరిస్తారా? ఇదంతా మీకు అవగాహన ఉన్న కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేందుకు కాదా? ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా మీ అస్మదీయులకు దోచిపెట్టడం, ప్రశ్నిస్తే తెలుగు జాతి మీద దాడి అని ఎదురు దాడి చేయడం మీకు పరిపాటి అయింది. తెలుగు జాతి గౌరవాన్ని మీ స్వార్ధానికి బలి చేస్తున్నారు. కాదని చెప్పగలరా? ఈ విషయంపై సీబీఐ విచారణకు
సిద్ధమా?

ప్రశ్న నెంబర్‌ 85:  భారత దేశ చరిత్రలో ప్రజస్వామ్యబద్దంగా ఎన్నిక కాబడిన గ్రామసర్పంచులకు మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా? వాళ్లను పక్కన పెట్టి, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల హక్కులను హరించారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు 20, 30 నెలల నుంచి వాళ్లకు జీతాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయి బ్రహ్మాండంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో ప్రజలకు వివరించగలరా? ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోతే దాని బాధ్యత మీరు వహించేందుకు సిద్ధంగా ఉన్నారా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement