కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రకాలుగా కేంద్రం అదుకుంటుంటే, పథకం ప్రకారం తమ పార్టీని దెబ్బ తీసేందుకు టీడీపీ నేతలు చూస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు పొత్తుతో అధికారంలోకి వచ్చాక బీజేపీపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఏపీకి 10 ఏళ్లలో ఏమి చేయాలనేది విభజన చట్టంలో పెట్టారని, వాటిలో చాలా వరకు కేంద్రం అమలు చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 22 ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్ కేంద్రం ఇచ్చిందని తెలిపారు.
‘ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధులకంటే ఎక్కువగా ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇచ్చింది. దీన్ని సీఎం చంద్రబాబు ఆమోదించి అభినందించారు. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజి బాగుందన్నారు. లక్షా 25 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పుడు బీదపలుకులు పలకడమేంటి? దేశంలోనే ఏపీ నెంబర్‌వన్ అన్నారు. జీడీపీలో ముందున్నామన్నారు. ఇపుడు ఇంకొరకంగా మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో అమలు చేయాల్సినవే కాకుండా చెప్పని ప్రాజెక్టులు కూడా మంజూరు చేశాం. పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు బీదారుపులు చేయడమేంటి? బీజేపీని దోషిగా నిలబెట్టాలనుకుని టీడీపీ మిత్రధర్మాన్ని విస్మరిస్తోంది. బీజేపీని ముంచాలని చూస్తే టీడీపీ కూడా మునుగుతుందని గుర్తించాలి. ప్రత్యేక హోదా రాజకీయ స్టంట్. విభజన చట్రం ప్రకారం పదేళ్ల సమయం ఉంది. మిగిలిన ఆరేళ్లలో మిగతావి కూడా కేంద్రం పూర్తి చేస్తుంద’ని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment