
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ పోరు ఉంటుందని ఆప్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కపిల్ మిశ్రాకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల నియమావళి క్లాజ్ 1(1) ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకే షోకాజ్ నోటీస్ జారీ చేశామని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపించనున్నాయని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ట్వీట్‌పై రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కింది. షాహిన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నిరసనలు చేయిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్ షాహిన్‌బాగ్‌లో ప్రవేశించి మినీ పాకిస్తాన్‌గా మార్చిందని మండిపడ్డారు. ఢిల్లీలోని చంద్‌బాగ్, ఇందర్‌లోక్ ప్రాంతాలలో చట్టాలు అమలు కావడం లేదని అన్నారు.
ఢిల్లీని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు మినీ పాకిస్తాన్‌లు చేశాయని విమర్శించారు. ఎన్నికల్లో వారికి సరైన జవాబు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మోడల్ టౌన్ నుంచి పోటీ చేస్తున్న కపిల్ మిశ్రా నామినేషన్ పత్రాలను తప్పుగా జతపరచారని..మిశ్రా అభ్కర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment