కుటుంబ సభ్యులతో విజయానందం
జయనగర : జయనగర నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, మంత్రిపదవి ఇచ్చినా స్వీకరించేదిలేదని జయనగర ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి తెలిపారు. జయనగర ఎన్నిక పలితాలు వెల్లడైన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సమాజసేవనే తన గెలుపునకు ఒక కారణమని, తండ్రి కుటుంబసభ్యులు, కార్యకర్తలు తన గెలుపునకు శ్రమించారన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉన్నప్పటికీ తన గెలుపుకోసం కష్టపడ్డారన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు మద్దతు పలకడంతో విజయం సులభమైందన్నారు. తన విజయానికి కారకులైన జయనగర ఓటర్లుకు సౌమ్యారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జయనగర వాసులు తనను కూతురుగా చూసి అక్కున చేర్చుకున్నారన్నారు.
సౌమ్యారెడ్డి ప్రొఫైల్ : జయనగరలో గెలుపుతో సౌమ్యారెడ్డి వార్తల్లోని వ్యక్తిగా మారారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు కావడం గమనార్హం. మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి, చాముండేశ్వరి దంపతుల కుమార్తె సౌమ్య. 1999లో జయనగరలోని అరవిందో మెమోరియల్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. జయనగర ఆర్‌వీ. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ముగించి ఎంఎస్ ఇన్ ఎన్విరాన్‌మెంట్ టెక్నాలజీని న్యూయార్క్ యూనివర్శిటీలో పూర్తిచేశారు. అనంతరం ఇండియా కు తిరిగివచ్చి బెంగళూరు నగరంలో ఎన్‌జీఓ సంస్థను ఏర్పాటు చేసిన సౌమ్యారెడ్డి పరిసరాల సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, జంతువుల సంరక్షణ పట్ల జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తండ్రితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ బెంగళూరు నగర యువజన కాంగ్రెస్ ఉపా«ధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment